Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: బండి సంజయ్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 09:20 PM

హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: బండి సంజయ్‌
Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల జిల్లా: హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువల్లో నీళ్లు వదలకపోతే వినాయక విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని బండి సంజయ్‌ అన్నారు. పరిస్థితి చేయి దాటకముందే నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్‌ భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.


అధికార కాంగ్రెస్‌ నేతలకు తాము అధికారంలో ఉన్నామనే విషయం గుర్తున్నట్లుగా లేదని బండి సంజయ్‌ విమర్శించారు. ప్రభుత్వం వద్ద భూదోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు చర్యలు తీసుకునే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ లక్ష కోట్ల విలువైన భూ దోపిడీకి పాల్పడిందని తేల్చేందుకు మూడేళ్లు పట్టిందా? అని నిలదీశారు.


ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తలుచుకుంటే మూడు గంటల్లోనే అన్ని ఆధారాలను బయటపెట్టవచ్చని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దోస్తులని విమర్శించారు. భూదోపిడీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఇరు పార్టీలు టైమ్‌పాస్‌ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు సీఎం భూదోపిడీ అంశాన్ని అడ్డుపెట్టుకుని బేరసారాలు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాలను బీఆర్‌ఎస్‌ కబ్జా చేసిందని చెబుతున్నారని, అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. ఆధారాలు చూపిస్తే ఆ భూములను తామే రక్షిస్తామని బండి సంజయ్ అన్నారు.


Also Read:

దానం నాగేందర్ ప్లాన్‌కు చెక్! సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేవియట్ దాఖలు

ఘనంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. పతాకధారులుగా మను భాకర్, పవన్

Updated Date - Sep 19 , 2026 | 09:20 PM