కోమలి ఆత్మహత్య.. నిజాలు బయటపెట్టిన రాయదుర్గం ఇన్‌స్పెక్టర్
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:11 PM
యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు గల కారణాలను బయటపెట్టారు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న. తన ప్రేమను అఖిల్ నిరాకరించడం వల్లే కోమలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణలో యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య సంచలనం రేపుతోంది. మణికొండలోని చిత్రపురికాలనీలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కోమలి. యూట్యూబర్ సూసైడ్‌పై రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న స్పందిస్తూ.. ఆత్మహత్యకు గల కారణాలు తెలిపారు. బుధవారం ఆయన ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో(ABN -Andhrajyothy) మాట్లాడుతూ.. తన ప్రేమను అఖిల్ నిరాకరించడం వల్లే కోమలి సూసైడ్ చేసుకుందని తెలిపారు. అఖిల్, కోమలి ఇద్దరూ విశాఖపట్నానికి చెందిన వారని.. అక్కడే వారికి పరిచయం ఏర్పడిందన్నారు.
ఆ తర్వాత కోమలి చదువు నిమిత్తం, అఖిల్ జాబ్ కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అఖిల్‌ను ఇష్టపడిన కోమలి.. అదే విషయాన్ని అతడికి చెప్పిందన్నారు. అప్పటికే అఖిల్ వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం వల్ల ఆమె ప్రేమను నిరాకరించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. దీంతో ఆరు నెలల క్రితం కోమలి ఓసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. ఆ సమయంలోనే అఖిల్‌ను ప్రేమిస్తున్న విషయం తల్లికి తెలిసిందన్నారు. కోమలిని పెళ్లి చేసుకోమని తల్లి అఖిల్‌ను అడగ్గా.. దానికి కూడా అతడు నిరాకరించాడని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఆత్మహత్యకు ముందు మాట్లాడదామని అఖిల్‌ను కోమలి పిలిచిందని.. అప్పుడు కూడా ప్రేమ ప్రస్తావన తీసుకురాగా మరోసారి అఖిల్ నిరాకరించినట్లు వెంకన్న చెప్పారు. తన ప్రేమను అఖిల్ అంగీకరించకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కోమలి తన డైరీలో కూడా రాసుకుందని చెప్పారు. కోమలి ఆత్మహత్యలో అఖిల్ ప్రమేయం ఉందని తెలిస్తే అతనిపై తప్పకుండా కేసు నమోదు చేస్తామని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు
తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: రామచంద్రరావు
Read Latest Telangana News And Telugu News