Share News

ఏసీబీ భయంతో..! అక్రమాస్తులు సర్దే పనిలో అధికారిణి

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:23 AM

వందల కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసిన మహిళా తహసీల్దార్‌ ఏసీబీ ఉన్నతాధికారుల ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకోవడానికి మరోవైపు చార్టెర్డ్‌ అకౌంటెంట్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.

ఏసీబీ భయంతో..!  అక్రమాస్తులు సర్దే పనిలో అధికారిణి

  • ఏసీబీ అధికారుల ప్రసన్నం దిశగా..

  • చార్టెర్డ్‌ అకౌంటెంట్లతో మంతనాలు

  • హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతానికి

  • తహసీల్దార్‌గా విధులు

  • కొన్నాళ్లుగా విధులకు గైర్హాజరు.. చర్చ

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసిన మహిళా తహసీల్దార్‌ ఏసీబీ ఉన్నతాధికారుల ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకోవడానికి మరోవైపు చార్టెర్డ్‌ అకౌంటెంట్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. తనపై ఫిర్యాదులు అందాయన్న సమాచారం తెలుసుకున్న ఆ అధికారిణి.. దాడుల భయంతో విధులకు హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతానికి తహస్దీలార్‌గా పనిచేస్తున్న సదరు అధికారిణి స్టార్‌ హోటళ్లలోనే సెటిల్‌మెంట్లు చేసే వారన్న ప్రచారం ఉంది. ఇందుకోసం ఒక ప్రైవేటు బృందాన్ని సైతం ఆమె ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన ప్రైవేట్‌ బృందం, మరో జిల్లాలోని జాయింట్‌ కలెక్టర్‌ స్ధాయి అధికారిని వెంట పెట్టుకుని స్టార్‌ హోటళ్లలో బుక్‌ చేసిన గదికి వెళ్లి.. ఫైళ్లను క్లియర్‌ చేసే వారని తెలుస్తోంది. ఇటీవల ఒక మాజీ పోలీసు అధికారికి సంబంధించిన భూ సమస్య విషయంలోనూ ఆమె పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. దాంతో సదరు రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఈ లంచావతారం గురించి స్వయంగా ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తహస్దీలార్‌ అక్రమాలపై విజిలెన్స్‌ విభాగానికీ భారీగానే ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తనపై ఏసీబీకి సైతం ఫిర్యాదులు వెళ్లిన విషయాన్ని పసిగట్టిన సదరు అధికారిణి.. ఈ సమస్య నుంచి బయటపడటానికి నెల రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సదరు అధికారిణి కుమారుడి వివాహం కాగా, సెలవు పూర్తయినా ఆమె విధుల్లో చేరకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఖరీదైన ప్రాంతం లో పోస్టింగ్‌ తర్వాత అనేక వివాదస్పద ఫైళ్లను ఆమె క్లియర్‌ చేశారని, ఈ క్రమంలో అందినంత దండుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 06:54 AM