వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో త్వరలో ఓపీ సేవలు !
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:18 AM
వరంగల్‌లో కొత్తగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబరులో సీఎం చేతులమీదుగా ఆస్పత్రి ప్రారంభోత్సవం
వరంగల్ మెడికల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో కొత్తగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్ అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎంజీఎంలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం సందర్శించిన సీఎంవో అధికారులు.. ఆస్పత్రి భవన నిర్మా ణ పనులను పరిశీలించారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా, నీటి వసతి, ఇతర ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం సీఎంఓ కార్యదర్శి కె.మాణిక్య రాజ్, ప్రణాళికా, ఆర్థికశాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్‌రెడ్డి నవంబరులో ప్రారంభిస్తారని సీఎంవో అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం సీఎంవో అధికారులు స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబరులో నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 18 అంతస్తులను సిద్ధం చేయాలన్నారు. ఆస్పత్రిని ప్రతి రోజు సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంజీఎం ఆస్పత్రి, ప్రభుత్వ సీకేఎం ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్లు, కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News