Share News

2వ తరగతిలోనే...చదవాలి, రాయాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:11 AM

ఐదో తరగతి విద్యార్థికి కనీసం చూసి చదవడం రాదు.. ఏడో తరగతి విద్యార్థికి కూడికలు, తీసివేతలు సరిగా రావు.. పదో తరగతి విద్యార్థికి ఇంగ్లిషులో కనీస పరిజ్ఞానం లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యంపై సర్వేల నివేదికలు చెప్పే అంశాలివి..

2వ తరగతిలోనే...చదవాలి, రాయాలి
Telangana Education Reforms 2026

  • ప్రతీ విద్యార్థి కూడికలు, తీసివేతలు చేయాలి..

  • బలమైన విద్యా పునాది.. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

  • ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమంతో సామర్థ్యాలు పెంచే చర్యలు

  • ప్రతీ విద్యార్థి విద్యా సామర్థ్యాన్ని ఏటా అంచనా వేస్తున్నాం

  • విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండటంతో వేగంగా సంస్కరణలు

  • ‘ఆంధ్రజ్యోతి’తో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఐదో తరగతి విద్యార్థికి కనీసం చూసి చదవడం రాదు.. ఏడో తరగతి విద్యార్థికి కూడికలు, తీసివేతలు సరిగా రావు.. పదో తరగతి విద్యార్థికి ఇంగ్లిషులో కనీస పరిజ్ఞానం లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యంపై సర్వేల నివేదికలు చెప్పే అంశాలివి.. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల విద్యా సామర్థ్యం గత మూడేళ్లలో ఎంతో పెరిగిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.


రాష్ట్రంలో రెండో తరగతి చదివే విద్యార్థులు కూడా చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, కూడికలు, తీసివేతలు, భాగహారాలు చేసేలా చూడటంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వ బడుల్లో అమలుచేస్తున్న ‘ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)’ కార్యక్రమంపై ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో యోగితా రాణా ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను యోగితా రాణా ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


ఐక్యరాజ్యసమితి సమావేశంలో తెలంగాణ తరపున మీరు ఇచ్చిన సందేశం?

విద్యా సంస్కరణల కోసం నిరంతర రాజకీయ నిబద్ధత అవసరమన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా నేను ఇచ్చిన ప్రధాన సందేశం. మన సీఎం విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్నందున విద్యకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రైమరీ, 1 నుంచి 3వ తరగతులు చదువుతున్న పిల్లలే 2047 నాటికి తెలంగాణ శ్రామికశక్తిని, సమాజాన్ని తీర్చిదిద్దుతారు. అందువల్ల వారి విద్యకు బలమైన పునాది ఇప్పుడే వేయాలి. ఇందుకు ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కీలకం. పిల్లలు చదవడం, రాయడం, అర్ధం చేసుకోవడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను ఫౌండేషనల్‌ లిటరసీ అంటారు. అలాగే సంఖ్యలను గుర్తించడం, కూడిక, తీసివేత, ప్రాథమిక గణిత సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఫౌండేషనల్‌ న్యూమరసీ అంటారు. దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.


రాష్ట్రంలో‘ఎఫ్‌ఎల్‌ఎన్‌’ పరిస్థితి ఎలా ఉంది?

మనం గణనీయమైన పురోగతి సాధించాం. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. రెండో తరగతి విద్యార్థులపై ఏటా నిర్వహిస్తున్న స్వతంత్ర శాంపిల్‌ అసె్‌సమెంట్‌లో పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. 2022-23లో పరీక్షించిన విద్యార్థుల్లో తెలుగులో వాక్యాలను చదవగలిగినవారు కేవలం 9శాతం ఉండగా.. 2025-26లో అది 35 శాతానికి పెరిగింది. ఇంగ్లి్‌షలో పఠనం 4 శాతం నుంచి 29 శాతానికి పెరిగింది. గణితంలో క్యారీతో కూడిన కూడిక చేయగలిగినవారు 18 శాతం నుంచి 43 శాతానికి, బారోయింగ్‌తో తీసివేత చేయగలిగినవారు 10 శాతం నుంచి 30 శాతానికి పెరిగారు. ఇవి ప్రోత్సాహకరమైన ఫలితాలే. రాబోయే రెండు మూడేళ్లలో ప్రతి విద్యార్థి నాణ్యమైన ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా బలమైన పునాదితో పాఠశాలలోకి రావాలి. ప్రతి విద్యార్థి రెండో తరగతి పూర్తయ్యే నాటికి ‘ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)’ సాధించాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం.


ఎప్పటిలోగా లక్ష్యాన్ని చేరుకుంటారు?

పిల్లలు కనీస నైపుణ్యాలను నేర్చుకునే ప్రాథమిక విద్య దశను దాటాలనేదే మా తక్షణ ప్రాధాన్యం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను ఎఫ్‌ఎల్‌ఎన్‌ సామర్థ్యం కలిగిన పాఠశాలలుగా ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 2027 మార్చి నాటికి ప్రాథమిక నైపుణ్యాల్లో కనీసం 80 శాతం సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా కూడా రెండు, మూడేళ్లలో 80శాతం సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఎఫ్‌ఎల్‌ఎన్‌కు గడువుతో ముడిపెట్టకూడదు. చదవడం నేర్చుకోకుండానే విద్యా సంవత్సరం పూర్తిచేసే ప్రతి విద్యార్థి కోసం తదుపరి ఏడాది వ్యవస్థ మరింత కష్టపడాల్సి ఉంటుంది. అందుకే నెలవారీ సామర్థ్యాలను నిర్దేశించి, విద్యార్థుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.


ఎఫ్‌ఎల్‌ఎన్‌ సాధనలో ప్రధాన సవాళ్లు ఏమిటి?

హైదరాబాద్‌ నుంచి ఒక మార్గదర్శకాన్ని జారీ చేయడం సులభమే. అది వేలాది తరగతి గదుల్లో ప్రతిరోజూ నాణ్యమైన బోధన, అభ్యసన విధానంగా మారేలా చూడటమే అసలు సవాలు. చిన్న గ్రామీణ పాఠశాలలు, గిరిజన ప్రాంతాలు, పెద్ద పట్టణ పాఠశాలలు, వాటి పరిస్థితులు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. అలాగే 3, 4, 5వ తరగతుల్లో ఏళ్లుగా అభ్యసన లోటును ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉన్నారు. ఒకే తరగతిలో వివిధ స్థాయిల్లో ఉన్న పిల్లలకు బోధించాల్సిన పరిస్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతిరోజూ పరిష్కార చర్య (రెమెడియేషన్‌), ఎన్‌రిచ్‌మెంట్‌ పీరియడ్‌, నెలవారీ విద్యా సామర్థ్య లక్ష్యాలు, మెరుగైన అకడమిక్‌ మెంటారింగ్‌, పునరావృత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎస్‌సీఈఆర్టీ ప్రత్యేక రెమిడియేషన్‌ మెటీరియల్‌ను కూడా రూపొందించింది.


బోధనను తీసుకుంటున్న చర్యలేమిటి?

ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు హృదయం. ఎంత మంచి సంస్కరణ రూపొందించినా ఉపాధ్యాయుల సహకారం, విశ్వాసం, వనరులు పొందకపోతే అది విజయవంతం కాదు. అందుకే కేవలం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపైనే కాకుండా, ఉపాధ్యాయుడి చుట్టూ నిరంతర అకడమిక్‌ సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాం. మంచి బోధనా-అభ్యసన సామగ్రి, బోధనా పద్ధతులను మెరుగుపరుచుకునే అవకాశాలు, తరగతి గదిలో ఎదురయ్యే సమస్యలకు ఉపాధ్యాయులకు సహాయం అవసరం. ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమంలో భాగంగా 48,000 మందికి పైగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. ఎస్‌సీఈఆర్టీ తరగతి, సామర్థ్యానికి అనుగుణంగా అకడమిక్‌ సహకారాన్ని అందిస్తోంది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అకడమిక్‌ ప్యానెల్‌ బృందాలు, క్లస్టర్‌ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాశాఖ అధికారులు కూడా తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.


ఈ ప్రక్రియలో కృత్రిమ మేధను, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారా?

టెక్నాలజీ ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయకూడదు. ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడాలి. ఒకే తరగతిలో 30 మంది విద్యార్థుల అభ్యసన స్థాయిలు వేర్వేరుగా ఉండవచ్చు. ఈ తేడాలను టెక్నాలజీతో వేగంగా గుర్తించి, ప్రతి విద్యార్థికి తగిన అభ్యాసాన్ని అందించవచ్చు. ఈ క్రమంలో ఏఎక్స్‌ఎల్‌- ఎఫ్‌ఎల్‌ఎన్‌ అనే అడాప్టివ్‌ లెర్నింగ్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాల విద్యా విభాగం డ్యాష్‌బోర్డుల ద్వారా.. ఏఐ, ఇతర టెక్నాలజీలతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపును పర్యవేక్షించడం సులభంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బడా గణేశా.. బుడతడిని బతికించవూ!

డిగ్రీకి క్లోజింగ్‌ బెల్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 06:11 AM