బడా గణేశా.. బుడతడిని బతికించవూ!
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:01 AM
ద్ద సంఖ్యల్లో భక్తుల ఈలలు, డ్యాన్సులతో నెక్ల్‌స్ రోడ్డు వద్ద జోరుగా సాగుతున్న గణేశ్ శోభాయాత్రను తిలకిస్తున్న జనానికి గుండెను మెలిపెట్టే ఓ దృశ్యం కనిపించింది!
మూడేళ్ల బాలుడికి అరుదైన ప్రాణాంతక వ్యాధి
చికిత్సకు రూ. 26 కోట్లు.. దాతల కోసం కన్నవారి అభ్యర్థన
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెద్ద సంఖ్యల్లో భక్తుల ఈలలు, డ్యాన్సులతో నెక్ల్‌స్ రోడ్డు వద్ద జోరుగా సాగుతున్న గణేశ్ శోభాయాత్రను తిలకిస్తున్న జనానికి గుండెను మెలిపెట్టే ఓ దృశ్యం కనిపించింది! మూడేళ్ల కుమారుడిని చంకనెత్తుకున్న ఓ తండ్రి.. చేతిలో ఓ ప్లకార్డు పట్టుకున్నాడు. తన కుమారుడు అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్సకు రూ.26 కోట్లు అవసరం అని.. పెద్ద సంఖ్యలో దయగల దాతలు కరుణిస్తే తన కుమారుడు స్వస్థత పొందుతాడని ఆ ప్లకార్డులో ఉన్న సారాంశం!! మూడేళ్ల ఆ బాబు పేరు అశ్వర్థ్. ఆ బాబు.. కర్నూలు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన హరీశ్ కుమార్, బాల నవ్యశ్రీ దంపతుల ఇద్దరు సంతానంలో పెద్ద కుమారుడు. శుక్రవారం తన కుమారుడిని ఎత్తుకొని ఖైరతాబాద్ మహా గణపతి వద్ద హరీశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న సీపీ సజ్జనార్‌కు తమకు అండంగా నిలవాలంటూ అభ్యర్థించారు. తర్వాత హరీశ్ తన కుమారుడితో కలిసి నెక్లెస్ రోడ్డు వద్ద శోభాయాత్రలోనూ కనిపించారు. బ్యానర్ పట్టుకొని దాతలను ఆయన అభ్యర్థించారు. మనసున్న మహారాజులు స్పందించి 9700365341, 9490992981 అనే నంబర్లకు తోచినంత మొత్తం ఫోన్ పే, గూగుల్ పే చేసి ఆదుకోవాలని కోరారు.