అసెంబ్లీలో నలుగురు విశ్వకర్మ నేతలుండాల్సిందే
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:31 AM
చట్టసభల్లో ఇకపై విశ్వకర్మ కులం నుంచి నలుగురు అసెంబ్లీలో ఉండేలా ఒక శక్తిగా స్వర్ణకారులు తయారు కావాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య నిర్వచనం చెప్పిందీ మేమే: ఎమ్మెల్సీ సిరికొండ
మన్సూరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో ఇకపై విశ్వకర్మ కులం నుంచి నలుగురు అసెంబ్లీలో ఉండేలా ఒక శక్తిగా స్వర్ణకారులు తయారు కావాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. దేశాన్ని నడిపించే వాటిలో ఒకటి రాజ్యాధికారమైతే, రెండోది డబ్బు అని, అవి రెండూ లేనప్పుడు పట్టుదలతో ముందుకు సాగినప్పుడే మన హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ‘స్వర్ణకారుల శంఖారావం’ సభలో ముఖ్య అతిథులుగా మధుసూదనాచారితోపాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రజల చేత, ప్రజల నుంచి, ప్రజల కొరకు పరిపాలించేదే ప్రజాస్వామ్యమని నిర్వచనం చెప్పింది విశ్వకర్మ కులానికి చెందిన అబ్రహం లింకన్ అని, అంత గొప్ప విష యం చెప్పిన విశ్వకర్మలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. జాజుల మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కృతజ్ఞత కలిగి ఉండాల్సిన ఏకైక కులం విశ్వకర్మలేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మారోజు వీరన్న, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్, అమర వీరుడు శ్రీకాంత చారి విశ్వ కర్మీయులేనన్నారు. ఇతర కులాల వారి సభలకు సీఎం, మంత్రులు హాజరైతారు కానీ, బీసీల్లోని స్వర్ణకారుల సభకు ఏ ఒక్కరూ రాకపోవడం అవమానకరం అని చెప్పారు. సభకు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి అధ్యక్షత వహించగా, గౌరవాధ్యక్షుడు కట్టా సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
2027 జూన్ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి
హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ఇన్స్పెక్టర్కు 6 నెలలు టార్చర్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News