Share News

విజయ రెడ్డి ఆత్మహత్యపై లోతైన విచారణ: జీఆర్పీ డీఎస్పీ

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:59 PM

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ రెడ్డి ఆత్మహత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నామని జీఆర్పీ డీఎస్పీ జావేద్ స్పష్టం చేశారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతోపాటు ఆమె సహచర ఉద్యోగులకు విచారించామని చెప్పారు.

విజయ రెడ్డి ఆత్మహత్యపై లోతైన విచారణ: జీఆర్పీ డీఎస్పీ

హైదరాబాద్, ఫిబ్రవరి 02: రైల్వే ట్రాక్‌పై విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. మృతురాలి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత.. వీరి ఆత్మహత్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విజయ రెడ్డికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తమ విచారణలో ఆమె కుటుంబ సభ్యులు వివరించారని పేర్కొన్నారు. ఆమెతో పని చేసే సహచర ఉద్యోగులను సైతం విచారించామని.. విజయ రెడ్డి ఆందోళనలో ఉండేదని వారు చెప్పారన్నారు.


ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతే.. తన ఇద్దరు పిల్లలను హాస్టల్ నుంచి ఆమె తీసుకెళ్లిందని వివరించారు. తమ బంధువులు చనిపోయారని చెప్పి.. వారిని హాస్టల్ నుండి తీసుకు వచ్చిందన్నారు. అయితే తమ మరణాలకు ఎవరూ కారణం కాదంటూ విజయ రెడ్డి రాసిన సూసైడ్ నోట్ లభించిందన్నారు. గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టే సమయంలో ఈ ముగ్గురు.. ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారని లోకో పైలట్.. తమ విచారణలో చెప్పారని ఈ సందర్భంగా జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. వీరి ఆత్మహత్యపై మరింత లోతుగా విచారిస్తున్నామని చెప్పారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

బోడుప్పల్‌లో నివసిస్తున్న విజయరెడ్డి తన కుమారుడు, కుమార్తెతో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి - ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.


ఈ సందర్భంగా వారిచ్చిన సమాచారం మేరకు విజయ రెడ్డి ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భర్త దుబాయ్‌లో ఉండడం.. కుమార్తె, కుమారుడు పటాన్‌చెరులో హాస్టల్‌లో ఉండి చదువుకోవడం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాలతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మరో వైపు పోస్ట్‌మార్టం నిర్వహించి.. కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేశారు. వీరి మరణ వార్త తెలియగానే భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం భువనగిరి జిల్లా బీబీనగర్‌లో వీరి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు: టీ బీజేపీ చీఫ్

జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

For More TG News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 07:05 PM