Share News

ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు: టీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:47 PM

గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు.

ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు: టీ బీజేపీ చీఫ్
T BJP Chief N Ramachandrarao

హైదరాబాద్, ఫిబ్రవరి 02: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ పీపుల్స్ ప్లాజాలో ‘బూటకపు హామీలు - మోసపూరిత వాగ్దానాలు’ అంటూ కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ థీమ్‌తో ఈ ఛార్జ్ షీట్‌ను విడుదల చేశామన్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.


T-BJP.jpg

రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని.. కానీ నేటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద వేల కోట్ల రూపాయిల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సంపూర్తిగా అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని.. తద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. షో పుటప్ తప్ప.. రాష్ట్రంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేదంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కలెక్షన్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు అంటూ ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలకు చేసిందేమిటో చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.


7 మున్సిపల్ కార్పొరేషన్లలో టాక్సీల పేరు మీద భారీ కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. దీనిలో రూ. 250 కోట్లకుపైగా కుంభకోణం జరిగిందని వివరించారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధుల్లో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా మారాయని.. నిత్యం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిందన్నారు. డ్రగ్స్‌కు కేంద్రంగా తెలంగాణ మారిపోయిందంటూ మండిపడ్డారు.


హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. చివరకు దేవాలయాల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. కమిషన్, కాంట్రాక్ట్, కరప్షన్ ప్రభుత్వమని అభివర్ణించారు. ఇది 40 పర్సెంట్ కమిషన్ ప్రభుత్వమని వ్యంగ్యంగా అన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి.. తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు.


పోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. తొలుత బీజేపీ నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించాలని, గతంలో రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారని.. ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వండంటూ టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

For More TG News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 04:56 PM