జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:55 PM
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 02: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2026 ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సెషన్-2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమవగా.. చివరి తేదీగా ఫిబ్రవరి 25 ప్రకటించారు. ఆ రోజున రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే రోజున రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిచేయలేరు.
ఇకపోతే జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు.
ఒకే పేపర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము కేటగిరీని బట్టి మారుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1,000 చెల్లించాలి. జనరల్-EWS, OBC-NCL వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, PwD, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
అర్హతలు: జేఈఈ మెయిన్ 2026 కి నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం.. గత మూడు సంవత్సరాలలో 12వ తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, పరీక్షకు హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితి లేదు.
జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్ 1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, సెషన్ II కోసం రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు తమ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించాలి. అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తరువాత అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కి సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు, పరీక్షా కేంద్రం, నగరం వంటి సమాచారం, ఇతర ముఖ్యమైన అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక NTA JEE వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
డైరెక్ట్ అప్లికేషన్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..
లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
For More Education News And Telugu News