ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:47 AM
బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు, అవకతకతలపై ఫిర్యాదుల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
సిబ్బంది పని తీరు, సేవలపై జేటీసీ చంద్రశేఖర్ ఆరా
ఆఫీసులోకి దళారులను అనుమతించొద్దని ఆదేశాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు, అవకతకతలపై ఫిర్యాదుల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల పర్యవేక్షణకు అకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సంయుక్త కమిషనర్(జేటీసీ) చంద్రశేఖర్‌గౌడ్ బుధవారం ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీవో)లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుదారులతో స్వయంగా మాట్లాడిన ఆయన.. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? మెరుగైన సేవల అందుతున్నాయా? అని ఆరా తీశారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల నిర్వహణను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుతం అనుసరిస్తోన్న ప్రమాణాలు రహదారి భద్రతకు అనుగుణంగా ఉన్నాయా? ఏదైనా మార్పులు చేయాల్సి అవసరం ఉందా? అనే అంశంపై అధికారులతో చర్చించారు.
వివిధ పనుల నిమిత్తం వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. వాహన్ పోర్టల్‌లోని పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. అనవసర జాప్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయ ప్రాంగణంలోకి దళారులు, అనధికార వ్యక్తులను అనుమతించవద్దని ఆదేశించారు. ఏజెంట్లు వచ్చే అవకాశం కల్పించిన అధికారి/సిబ్బంది వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ’నో ఎంట్రీ ఫర్ బ్రోకర్స్’ బోర్డులను ప్రవేశ ద్వారాలు, ప్రతి కౌంటర్ వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా కార్యాలయాల్లో విజిలెన్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం
త్వరలో విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News