Share News

త్వరలో విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ!

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:34 AM

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ నివేదిక సమర్పించిన వెంటనే.. విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కోసం కమిటీ వేయాలని విద్యుత్‌ యాజమాన్యాలు నిర్ణయించాయి.

త్వరలో విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ!
Telangana Power Employees

  • రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సెలవులు, సౌకర్యాలు

  • ఇంజనీర్ల పర్యవేక్షణలోనే యాదాద్రి ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ నిర్వహణ

  • పవర్‌ జేఏసీతో విద్యుత్‌ యాజమాన్యాల చర్చలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ నివేదిక సమర్పించిన వెంటనే.. విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కోసం కమిటీ వేయాలని విద్యుత్‌ యాజమాన్యాలు నిర్ణయించాయి. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సెలవులు, వైద్య సౌకర్యాలు వర్తింపచేయడానికి అంగీకారం తెలిపాయి. బుధవారం, విద్యుత్‌ సౌధలో విద్యుత్‌ యాజమాన్య సంస్థలు పవర్‌ జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపాయి. ఉద్యోగుల వేతన సవరణ, ఆర్టిజన్ల సౌకర్యాలు, పదోన్నతులపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సమాచారం. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో కోల్‌ హ్యాండ్లింగ్‌ (సీహెచ్‌పీ), యాష్‌ హ్యాండ్లింగ్‌ (ఏహెచ్‌పీ) పాంట్ల నిర్వహణ పనులను సంస్థ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో చేయించేందుకు యాజమాన్యం సుముఖత తెలిపిందని జేఏసీ గుర్తు చేసింది.


ఈపీఎఫ్‌ సీలింగ్‌ పరిమితి పెంపు, 1999-2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ సౌకర్యం కల్పించే అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయని తెలిపింది. 2023 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రెగ్యులర్‌ పదోన్నతులు కల్పిస్తామని వెల్లడించాయని వివరించింది. మొత్తం 14 డిమాండ్లపై జరిగిన చర్చలకు సంబంధించి మినిట్స్‌ ఆఫ్‌ మీటింగ్‌ రెండురోజుల్లో అందిస్తామని యాజమాన్యం తెలిపిందని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని జేఏసీ వెల్లడించింది. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక, పదోన్నతుల్లో మెరిట్‌ కమ్‌ సీనియారిటీ జాబితాను అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ బీసీ, ఓసీ ఐక్యకార్యాచరణ సమితి కోరింది. న్యాయస్థానం తీర్పు ప్రకారం పదోన్నతులను సమీక్షించి, త్వరలోనే పరిష్కరిస్తామని యాజమాన్యాలు తెలిపినట్లు సమితి వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోతోంది

సాగుకు ఆరు గంటల కరెంటే!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 07:34 AM