సాగుకు ఆరు గంటల కరెంటే!
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:22 AM
రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుత విద్యుత్తు సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమే కారణం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
విద్యుత్తు కోతలకు నిరసనగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు
కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తం
‘సర్’పై ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
ఈసీ పనితీరుపై అనుమానాలు కలిగిస్తున్నాయి: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుత విద్యుత్తు సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమే కారణం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగుకు ఆరు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని ఆరోపించారు. సాగుకు కరెంట్ ఇవ్వనందుకు సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో ‘80 ట్రెండ్’ నడుస్తున్న ఈ సమయంలో రాష్ట్రంలో 1980ల నాటి విద్యుత్తు పరిస్థితులు తిరిగొచ్చాయని పేర్కొన్నారు. విద్యుత్తు సంక్షోభానికి ఎల్‌నినో ప్రభావం కారణం కాదని చెబుతూ ‘ఇది ఎల్‌నినో కాదు.. ఎల్ కాంగో’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న సమయంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరతతో ఉత్పత్తి పడిపోతోందని, జల విద్యుత్తు కేంద్రాలు కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యుత్తు వ్యవస్థపై తాము చేస్తున్న ఆరోపణలకు క్షేత్ర స్థాయిలో ఆధారాలను సేకరించేందుకు గురువారం పార్టీ తరఫున ఆరు బృందాలను పంపుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ బృందాలు రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తాయని వెల్లడించారు. 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో సుమారు 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ నిలిచిపోయిందన్నారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా.. సుమారు 544 మెగావాట్ల స్థాయిలోనే ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.
విద్యుత్తు సంక్షోభానికి ప్రధాన కారణాల్లో సింగరేణి బొగ్గు సరఫరా వ్యవస్థ కూడా ఒకటని కేటీఆర్ ఆరోపించారు. జెన్‌కోకు నాణ్యమైన బొగ్గును అందించాల్సిన సింగరేణి.. తక్కువ నాణ్యత కలిగిన జి-13, జి-14 గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నదని అన్నారు. నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో రూ.2,900 కోట్ల ప్రజాధనం నష్టపోయిందని పేర్కొన్నారు. కాగా ‘ప్రత్యేక ఓటర్ల సవరణ(సర్)’ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల సంఘం పనితీరుపై ఇప్పుడు తీవ్రమైన విశ్వాస సంక్షోభం నెలకొందని కేటీఆర్ ఆరోపించారు. సర్ ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు అనేక ప్రశ్నలు, అనుమానాలను రేకెత్తిస్తున్నాయన్నారు. దీన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు మంత్రులు వెళ్లిన హెలికాప్టర్‌కు ఇంధన సమస్య!
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News