Share News

ఫ్యూచర్‌ సిటీలో నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ క్యాంపస్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:16 AM

రాజధాని హైదరాబాద్‌ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్థమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్‌ సిటీలో నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ క్యాంపస్‌
Report to Cm Revanth

  • హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ అంగీకారం

  • లండన్‌లో స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లతో

  • సానుకూల చర్చలు.. స్వల్పకాలిక ప్రోగ్రాముల నిర్వహణకు ‘హార్వర్డ్‌’ ఓకే

  • యూకే, యూఎస్‌ పర్యటనల్లో కుదిరిన ఒప్పందాలపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక

  • సీఎం రేవంత్‌కు అందజేత..

  • అంతర్జాతీయ స్థాయి విద్యకు కేంద్రంగా హైదరాబాద్‌: సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్థమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను.. భాగస్వామ్యాలు, ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సల ద్వారా హైదరాబాద్‌కు తీసుకురావడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో పాటు తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకేలో, అలాగే అధికారుల బృందం అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనల్లో సాధించిన చరిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు, లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తదితర వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం సీఎం రేవంత్‌కు అందజేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, పరిశోధన, డిఫెన్స్‌ రంగాల్లో ఇప్పటికే ప్రపంచపటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్‌ నగరాన్ని.. ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికాలోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ (బోస్టన్‌), యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లు భారత్‌లో తమ తొలి ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని పేర్కొంది. ముఖ్యంగా నార్త్‌ఈస్టర్న్‌ వర్సిటీ తమ క్యాంప్‌సను.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అలాగే.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ , స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ సంస్థలతో చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడించింది. ఇక.. సీనియర్‌ ప్రభుత్వ, కార్పొరేట్‌ అధికారుల కోసం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించేందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీ అంగీకరించినట్టు పేర్కొంది. ఈ అంతర్జాతీయ కోర్సులు వచ్చే నవంబర్‌ నుంచే ప్రారంభం కానున్నట్టు తెలిపింది. పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, వర్జీనియా టెక్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ వంటి దిగ్గజ విద్యాసంస్థల అధిపతులతో విస్తృతస్థాయి చర్చలు జరిపింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీతో సంయుక్త పరిశోధన కేంద్రాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించింది. ఈమేరకు ఆయా సంస్థలకు చెందిన నిపుణుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి.. ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి.


అత్యుత్తమ విద్యకు నాయకత్వం వహిస్తా..

కమిటీ నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి.. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు, లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ విజయవంతంగా కుదరడం ద్వారా పెద్ద ప్రోత్సాహం లభించిందన్నారు. ‘‘రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలతో ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. తెలంగాణతో పాటు మొత్తం భారతదేశంలోని యువత, చిన్నారులకు అత్యుత్తమ విద్యా అవకాశాలను అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తాను’’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు రానున్న ప్రపంచస్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో పాటు దేశంలోని యువత, చిన్నారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు. యువత ఈ విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, ప్రపంచ స్థాయిలో పోటీపడగల నిపుణులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్థి చేసుకోవాలని, తెలంగాణ రైజింగ్‌ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని సీఎం అభిలషించారు.


ఇవి కూడా చదవండి

అధికారిక ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో ఔట్‌

152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి!

Updated Date - Sep 01 , 2026 | 04:33 AM