Share News

152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి!

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:44 AM

ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై తలపెట్టిన బ్యారేజీ విషయంలో 152 మీటర్ల ఎత్తు వరకు అనుమతి కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది.

152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి!
tummidihatti barrage

  • మహారాష్ట్రకు ప్రతిపాదించనున్న తెలంగాణ

  • 150 మీటర్లకైనా ఒప్పించాలన్నది వ్యూహం

  • నేడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై తలపెట్టిన బ్యారేజీ విషయంలో 152 మీటర్ల ఎత్తు వరకు అనుమతి కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది. 152 మీటర్ల ఎత్తు కోసం పట్టుబట్టి కనీసం 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని యోచిస్తోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని కోరుతూ ప్రధానమంత్రికి జూన్‌ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శులతో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) కీలక సమావేశం జరుగుతోంది. 150 మీటర్ల ఎత్తుతోనే బ్యారేజీ నిర్మాణం కోసం తొలుత కసరత్తు జరిగింది. 152 మీటర్ల ఎత్తు కోసం పట్టుబట్టాలని అధికారులకు ఉన్నత స్థాయిలో ఆదేశాలు వచ్చాయి. దాంతో 152 మీటర్ల ఎత్తుతో కలిగే ముంపు, నీటి లభ్యత, ప్రయోజనాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఒక బ్యారేజీ వార్థాపై, మరొకటి వెన్‌గంగాపై కట్టాలని ప్రతిపాదించారు. వార్థా బ్యారేజీని 60 గేట్లతో, వెన్‌గంగాను 77 గేట్లతో నిర్మాణం చేపట్టాలన్నది యోచన. 867 మీటర్ల పొడవున వార్థా, 1113.5 మీటర్ల పొడవున వెన్‌గంగా బ్యారేజీల నిర్మాణం చేపట్టాలన్నది ఆలోచన. ఈ రెండు కూడా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. నది ప్రవాహానికి అడ్డంగా లంబాకారంలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలన్నది ప్రతిపాదన. ఈ డిజైన్‌ను సీడబ్ల్యూసీతో సంప్రదింపులు జరిపి, సర్వేలో ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్‌)ను ఆర్వీ అసోసియేట్స్‌ అందించింది. ఎటువంటి గ్రామాల ముంపు లేకుండా 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీలు కట్టవచ్చని గుర్తు చేసింది. తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ గ్రామాల ముంపు ఉండబోదని ఆ నివేదికలో పేర్కొన్నారు. 150 మీటర్ల ఎత్తుతో కడితే 4,215 ఎకరాల నదీగర్భం, చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్‌కు చెందిన 943 ఎకరాలు ముంపునకు గురి అవుతాయి. అయితే, 1,018 ఎకరాలు సేకరిస్తే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి 2016 మార్చి 8వ తేదీన మహారాష్ట్రతో ఒప్పందం కూడా జరిగింది. దీన్ని అప్పట్లో 165 టీఎంసీలతో ప్రతిపాదించారు. 2015 ఫిబ్రవరి 13న హైడ్రాలజీ అనుమతి కూడా లభించింది. ఇరిగేషన్‌ ప్లానింగ్‌, అంతరాష్ట్ర క్లియరెన్‌, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చి, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు(భూగర్భ జలాలపై), నిర్మాణం కోసం వినియోగించే యంత్ర పరికరాలు, మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌(పంటలపై) అనుమతులు వచ్చాయి. ఇక పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ కూడా జరిగింది. మహారాష్ట్రలో మాత్రం ఈ పని పూర్తికాలేదు. పలు అనుమతులు ఇదివరకే ఉండటంతో ఢిల్లీలో జరిగే భేటీలో మహారాష్ట్రను అధికారుల స్థాయిలో ఒప్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. అధికారుల స్థాయిలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రుల స్థాయిలో తదుపరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. తొలుత మహారాష్ట్ర ముందు 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనను ఉంచి, కనీసం 150 మీటర్ల ఎత్తుతో అయినా ఒప్పించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మంగళవారం జరిగే సమావేశానికి సహకరించడానికి సీఎంవో కూడా రంగంలోకి దిగింది. సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్కరాజ్‌ కన్నన్‌, ప్రభుత్వ సలహాదారుఆదిత్యనాథ్‌దాస్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధతోపాటు కీలక అధికారులంతా భేటీలో పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి

కేసీఆర్‌ రాజీనామా చెయ్‌!

కరువులోనూ కరుణించిన గంగమ్మ..

Updated Date - Sep 01 , 2026 | 03:57 AM