Share News

మార్కాపురం ఇక అన్‌స్టాపబుల్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:59 AM

‘మార్కాపురం ఇక అన్‌స్టాపబుల్‌. అభివృద్ధిలో పరుగులు... కృష్ణా జలాల రాకతో జీవితాల్లో మార్పులు ఖాయం. 2028లో కృష్ణా పుష్కరాలు మార్కాపురంలో కూడా జరుగుతాయి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఫీడర్‌ కాలువపై గేట్లు ఎత్తి కృష్ణా జలాలను నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు ఆయన విడుదల చేశారు.

మార్కాపురం ఇక అన్‌స్టాపబుల్‌
వెలిగొండ ప్రారంభోత్సవ పైలాన్‌ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబుతో మంత్రి నిమ్మల, ఎంపీ మాగుంట, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

వచ్చే నెలలో ఉద్యానహబ్‌ ప్రారంభం

2028లో ఇక్కడ కూడా కృష్ణా పుష్కరాలు

మీ జీవితాలు మార్చాలన్నదే లక్ష్యం

ఇదే కూటమి ప్రభుత్వ విధానం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

వెలిగొండ తొలిదశ ప్రారంభం

నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు విడుదల

మార్కాపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ‘మార్కాపురం ఇక అన్‌స్టాపబుల్‌. అభివృద్ధిలో పరుగులు... కృష్ణా జలాల రాకతో జీవితాల్లో మార్పులు ఖాయం. 2028లో కృష్ణా పుష్కరాలు మార్కాపురంలో కూడా జరుగుతాయి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఫీడర్‌ కాలువపై గేట్లు ఎత్తి కృష్ణా జలాలను నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు ఆయన విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘వెలిగొండ జలసిరులతో మార్కాపురం జిల్లా ప్రజల అభివృద్ధికి రెక్కలు తొడిగాం. మాట ఇచ్చి కృష్ణమ్మను తరలించాం. ఇక సంపద సృష్టిస్తాం’ అని అన్నారు. మార్కాపురం గడ్డకు, కరువుపై పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్‌ బాధలు భరించిన కుటుంబాలకు, నీటికోసం ఎదురుచూసి అలసిపోయిన తరాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి పోస్తున్నామని సీఎం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడి ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లాను ఇచ్చానని చెప్పారు. తద్వారా భవిష్యత్తుకు భరోసా కల్పించానని సీఎం చెప్పారు. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం ఇచ్చి ఇటు వెలిగొండ జలాలతోపాటు ఉద్యాన పంటలు పండించేలా రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌లో మార్కాపురం కూడా భాగమయ్యేలా చేశామన్నారు. పండించిన పంటల రవాణాకు రామాయపట్నం పోర్టు ద్వారా అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

ప్రజల సంతోషాన్ని చూసి గుండె బరువెక్కింది

కరువుతో విలవిల్లాడుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజానీకానికి వరదాయినిగా ఉన్న వెలిగొండను పూర్తి చేసి ప్రజల భవిష్యత్తు మార్చాలని సంకల్పించామని చంద్రబాబు అన్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.2,402 కోట్లు ఖర్చు చేసి వెలిగొండ తొలిదశ పనులు పూర్తిచేశామని చెప్పారు. ప్రాజెక్టుకు ముప్పయ్యేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన తానే నేడు పూర్తి చేయడం బగవంతుడు ఇచ్చిన అదృష్టం అన్నారు. మొత్తం రూ.10,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.5,662 కోట్లు టీడీపీ, కూటమి ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామన్నారు. కృష్ణా జలాలు విడుదల చేసిన తరువాత ఇక్కడి ప్రజల సంతోషాన్ని చూసి నా గుండె బరువెక్కిందన్నారు. కృష్ణా జలాలు చూసి ఒళ్లు పులకరించిందన్నారు.

2028 నాటికి వెలిగొండ రెండో దశ పూర్తి చేస్తాం

2019లో వెలిగొండకు గ్రహణం పడితే అది ఇప్పుడు తొలగిందన్నారు. మరో రూ.1.900 కోట్లు ఖర్చు చేయడం ద్వారా వెలిగొండ రెండో దశ కూడా పూర్తవుతుందని చంద్రబాబు అన్నారు. 2028 నాటికి తప్పకుండా ఫేజ్‌-2 కూడా పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పారు. ఈ మాట అనగానే ప్రజలు కేరింతలు కొట్టారు. 2028లో కృష్ణా పుష్కరాలు జరగబోతున్నాయని, వాటిని మార్కాపురంలో కూడా నిర్వహిస్తామని సీఎం చెప్పారు.

పర్యాటక అభివృద్ధికి అడుగులు

వెలిగొండ పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి అడుగులు వేగంగా పడబోతున్నాయని సీఎం చెప్పారు. మార్కాపురం, కంభం చెరువు, నల్లమల అందాలు, ఎగువున ఉన్న శ్రీశైలం అన్నింటినీ కలుపుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. జిల్లా ఏర్పాటు, ఉద్యాన హబ్‌, వెలిగొండ జలాలతో మార్కాపురం ఇక అన్‌స్టాపబుల్‌ అని సీఎం చెప్పగానే సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు చేయకుండా.. కరువు, ఫ్లోరైడ్‌తో ఇబ్బందులు పడే ప్రజలపై కనికరం లేకుండా మోసం చేసిన గొడ్డలి పార్టీలాగా కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం మంచి సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామన్నారు. నెక్ట్స్‌ ఎలక్షన్‌ కాదు.. నెక్ట్స్‌ జనరేషన్‌ అనే నినాదం సభలో వినిపించారు. చంద్రబాబు అనే నేను మీకోసం పని చేస్తున్నా... మీరు మంచి చేసే పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం

వెలిగొండ కోసం ఊళ్లను, భూములను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం అంటూ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో నిర్వాసితులనుద్దేశించి మాట్లాడారు. గత పాలకులు నిర్వాసితుల సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన పరిహారం రూ.910 కోట్లతోపాటు మరో రూ.169 కోట్లు అదనంగా ఇస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. 2019 తరువాత ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ రూ.2లక్షలు ఇస్తున్నామన్నారు. ఎన్ని ఇచ్చినా వారి త్యాగాలు మరువలేమని, వారి రుణం తీర్చలేనిదని సీఎం అన్నారు. సభా కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వెలిగొండ కోసం కష్టపడి పనిచేసిన కొందరు అధికారులు, ఇంజనీర్లకు సీఎం ప్రసంశా పత్రాలు అందజేశారు. సభలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్‌, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్‌, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌, వెంకటరాజు, కాకర్ల సురేష్‌, టీడీపీ వై.పాలెం, దర్శి ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 02:59 AM