Share News

కరువులోనూ కరుణించిన గంగమ్మ..

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:22 AM

జిల్లాలో భూగర్భ జలమట్టం పెరుగుతోంది. ఇటీవల కురిసిన మోస్తారు వర్షాల కారణంగా పాతాళగంగ ఇంకాస్త పైకి వచ్చింది.

 కరువులోనూ కరుణించిన గంగమ్మ..

- జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం

- ఆగస్టు నెలలో 3.17 మీటర్ల పెరుగుదల

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

జిల్లాలో భూగర్భ జలమట్టం పెరుగుతోంది. ఇటీవల కురిసిన మోస్తారు వర్షాల కారణంగా పాతాళగంగ ఇంకాస్త పైకి వచ్చింది. ఈ వర్షాకాలంలో నీటి గోస రూపంలో ఎదురయ్యే కష్టాలకు కాస్త తెరపినిచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి పంటల సాగుకు, తాగునీటికి కష్టకాలమేననే సంకేతాల నేపథ్యంలో కురిసిన కాసిన్ని వానలే భూగర్భజలమట్టం పెరగడానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్‌ కార్పొరేషనలో రెండు నెలల క్రితం పలు ఇళ్లలోని బోర్లు అడుగంటే దుస్థితి నెలకొంది. చాలామంది ట్యాంకర్ల ద్వారా సంపులను నింపాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలాంటి కష్టాలకు కాస్త ఊరట కలిగించే విధంగా లోతుకు దిగజారిన నీళ్లు కాస్త పైపైకి పెరిగాయి. ఇప్పటికీ జిల్లాలో లోటు వర్షపాతమే ఉంది. ఆగస్టు చివరినాటికి 565.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగానూ 474.9 మిల్లీమీటర్ల మాత్రమే కురిసింది. 16 శాతం తక్కువ వర్షం కురిసింది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి ఊరట కలిగించే విధంగా భూమిలో నీరు పెరిగింది.

ఫ గత నెలతో పోలిస్తే మెరుగ్గా..

జూలై నెలలో జిల్లాలో సగటున 9.21 మీటర్ల లోతులో నీళ్లుండగా.. ఇప్పుడు ఆగస్టు చివరి నాటికి 6.04 మీటర్లకు వచ్చాయి. నెల రోజుల్లోనే దాదాపు 3.17 మీటర్లు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇప్పుడు జిల్లాలోని అన్ని పారంతాల్లో అగాథానికి పడిపోయిన నీటి మట్టం అమాంతంగా పెరిగింది. మే నెలలో జిల్లాలో సగటు 8.44 మీటర్ల లోతులోనే నీటి జాడలు కనిపించగా ఇప్పుడా పరిస్థితి ఇంకాస్త మెరుగనే విధంగా 6.04 మీటర్లకు ఎగబాకింది. మానకొండూర్‌ మండలంలో కేవలం 1.47 మీటర్లలో నీరు లభ్యమవుతుందని జిల్లా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన కొలతల్లో స్పష్టం చేశారు. చొప్పదండి మండలంలో గరిష్ఠంగా 13.14 మీటర్ల భూగర్భ జలాలు పడిపోయాయ. ఒకప్పుడు గంగాధర మండలంలో ఈ గడ్డుపరిస్థితి ఉండగా ఇప్పుడు అక్కడ 12.06మీటర్ల లోతులో నీరు లభ్యమవుతోంది.

ఫ గత ఏడాదికన్నా తక్కువ

గతేడాది సరిగ్గా ఇదే సమయంతో పోలిస్తే మాత్రం జిల్లాలో జలవనరుల పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఈ వానాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచినా సమృద్ధిగా వానలు ఈసారి కురువలేదు. గతేడాది ఆగస్టు చివరి వారంలో కురిసిన వానల వల్ల భూగర్భజలమట్టం జిల్లా వ్యాప్తంగా 4.97 మీటర్ల పైకి ఉంది. ఇప్పుడు 6.04 మీటర్ల లోతు ఉంది. అంటే కిందటి ఏడాదితో పోలిస్తే 1.07 మీటర్ల లోతున ఈసారి నీళ్లున్నాయి. చిగురుమామిడి(-3.54), కరీంనగర్‌ అర్బన(-3.23), హుజూరాబాద్‌ (-4.33)మండలాల్లో గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే జలమట్టం పడిపోయింది. కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న ఎల్‌ఎండీ జలాశయంలో 11 టీఎంసీలకు చేరువగా నీళ్లుండటంతో నగరంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఇక చెరువులు కుంటల్లోనూ ఈసారి కురిసిన వర్షాల వల్ల కొన్ని నీళ్లు వచ్చి చేరడం ఊరట కలిగిస్తోంది.

జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో)

--------------------------------------------------

మండలం జూలై ఆగస్టు పెరుగుదల

--------------------------------------------------

చిగురుమామడి 11.75 7.11 4.64

చొప్పదండి 14.54 13.14 1.40

ఇల్లందకుంట 5.32 4.47 0.85

గంగాధర 16.45 12.06 4.39

గన్నేరువరం 8.97 2.81 6.16

హుజూరాబాద్‌ 8.69 8.61 0.08

జమ్మికుంట 4.90 3.86 1.04

కరీంనగర్‌ 15.55 10.34 5.21

కరీంనగర్‌రూరల్‌ 4.95 2.16 2.79

కొత్తపల్లి 8.34 5.39 2.95

శంకరపట్నం 7.96 5.02 2.94

మానకొండూర్‌ 7.75 1.47 6.28

రామడుగు 8.31 6.88 1.43

సైదాపూర్‌ 8.24 5.34 2.90

తిమ్మాపూర్‌ 9.83 4.26 5.57

వీణవంక 5.35 4.68 0.67

--------------------------------------------------

జిల్లా సగటు 9.21 6.04 3.17

--------------------------------------------------

Updated Date - Sep 01 , 2026 | 01:22 AM