Share News

కేసీఆర్‌ రాజీనామా చెయ్‌!

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:25 AM

దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం చూస్తాం కానీ తెలంగాణలో ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ తన బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారన్నారు.

కేసీఆర్‌ రాజీనామా చెయ్‌!
telangana cm revanth reddy

  • ప్రధాన ప్రతిపక్ష నేతగా నువ్వెందుకు?

  • కుటుంబమంతా కలిసి లక్ష కోట్లు దోచుకున్నరు

  • వెయ్యి రోజుల్లో గంటైనా పేదలకు కేటాయించావా?

  • దినాలకు వెళ్తవు.. మనవడికి దెబ్బ తగిలితే పోతవు

  • మూడేళ్లు కనబడని విపక్ష నేతను ఏం చేయాలి?

  • అంబర్‌పేట సభలో సీఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

  • కేసీఆర్‌ రాజీనామాకై రాష్ట్రమంతా నిరసనలకు పిలుపు

  • అల్వాల్‌ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య పేరు

  • ఎల్బీనగర్‌ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు

  • వరంగల్‌ టిమ్స్‌కు జయశంకర్‌ పేరు: సీఎం ప్రకటన

  • మూసీపై మూసారాంబాగ్‌ కొత్త వంతెన ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/అంబర్‌పేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం చూస్తాం కానీ తెలంగాణలో ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ తన బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారన్నారు. ఆయన ఎమ్మెల్యేగా వెయ్యి రోజుల్లో కోటీ పాతిక లక్షల రూపాయల జీతం తీసుకున్నారని, ఆయన భద్రత, ఇతర అవసరాలకు ప్రభుత్వం వెయ్యి రోజుల్లో రూ.21 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఆయన ప్రజల సొమ్ము పందికొక్కులా మెక్కి ఒక్క రోజైనా వారికోసం బయటకు రాలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైన కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మూసీ నది మీద మూసారాంబాగ్‌ వద్ద రూ.52 కోట్లతో నిర్మించిన హైలెవల్‌ వంతెనను ప్రారంభించారు.ఈ సందర్భంగా అంబర్‌పేట వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వెయ్యి రోజుల ప్రభుత్వ పాలనపై నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్‌ఎస్‌ ప్రకటించిందని ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం విఫలమైనట్టా? అని ప్రశ్నించారు. ‘‘వెయ్యి రోజుల్లో రూ.22.25 కోట్లు మెక్కినవ్‌... ఏనాడైనా పేదలు, ఆడబిడ్డలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీల కోసం ఏమన్నా ఇచ్చావా దుర్మార్గుడా? నీ బంధువులు చనిపోతే దినాలకు పోతవు.


నీ మనవడికి దెబ్బ తగిలితే దవాఖానకు చూడడానికి పోతవు. ప్రజల కోసం బయటకు రావా? ఇందుకోసమేనా కోట్ల రూపాయల జీతభత్యాలు ఇచ్చి తెలంగాణ నిన్ను సాకుతున్నది? పందికొక్కులా ప్రజల సొమ్ము మెక్కి ఫామ్‌ హౌస్‌లో పండుకుంటే అయిపోయిందా? వెయ్యి రోజులు మొఖం చాటేసిన ప్రతిపక్ష నేత దేశంలో ఎవడైనా ఉన్నడా?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ వెయ్యి రోజుల్లో తాను ఒక గంట సెలవు తీసుకోలేదని, కేసీఆర్‌ ఒక గంట సమయం కూడా వెచ్చించలేదని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు విధులకు రాకుంటే ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తారని, మరి వెయ్యి రోజులు రాని కేసీఆర్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం ఐదుగురు తొమ్మిదిన్నర ఏళ్లు లక్ష కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు వెయ్యి రోజుల్లో అప్పనంగా ప్రభుత్వం సొమ్ము మెక్కుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో కార్యకర్తల రక్తం తీసుకొని, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్ముకున్నరు. ఇంతకంటే దుర్మార్గుడు ఉంటరా? అని ప్రశ్నించారు. ‘‘హరీశ్‌రావు పెట్రోల్‌ తీసుకొని, అగ్గిపెట్ట్టె మర్చిపోయిన నాటకం చూసి రెచ్చిపోయి ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంతాచారి కాల్చుకున్నడు. 1200 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నది నువ్వు కాదా?’’ అన్నారు. వెయ్యి రోజుల్లో ఒక్క గంట కూడా ప్రజలకు కేటాయించని ప్రతిపక్ష నాయకుడు తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నుంచి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌, అనుబంధ సంఘాలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఏడో తేదీన అసెంబ్లీ మొదలవుతుందని, కేసీఆర్‌ ఇప్పటికైనా సభకు వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాలని సూచించారు. ఇప్పటివరకు అనేక కష్టాలు పడి వ్యవస్థను దారిలోకి తెచ్చానని, ఇప్పటి నుంచి ప్రయాణం సాఫీగా సాగుతుందని, ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. కాళ్లు, చేతులు కూడదీసుకున్నామని, పాలన పట్టాలెక్కిందని, ఇక సాఫీగా నడిపిస్తానని చెప్పారు.


ఏ రోజు కూడా తన కుటుంబం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదన్నారు. తనను గుంపు మేస్ర్తీ అని వెక్కిరిస్తున్నారని, తన గుంపు ప్రజలేనని, అందరూ కలిసి తనకు ఈ జిమ్మేదార్‌ ఇచ్చిండ్రని చెప్పారు. అమెరికాలో బాత్‌రూమ్‌లు కడిగి, అక్కడ బతకలేక వచ్చినాయన లాగా తాను కంపెనీల సీఈవోగా ప్రొజెక్టు చేసుకోవడం లేదని చెప్పారు. ‘‘కేసీఆర్‌ నేను, ముసలామె.. మాకు బుక్కెడుబువ్వ చాలని తెలంగాణ ప్రజలను నమ్మించి, తరువాత కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుడి కొడుకు, దయాకర్‌రావు, మాధవరం కృష్ణారావు, దివాకర్‌రావులను పిలిచిండు. మంద లెక్క జమై మంది సొమ్ము తిన్నరు. నేను ఏమన్నా అట్ట చేసిననా? నాకు అవకాశం వస్తే బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌, హన్మంతన్న, అనిల్‌ కుమార్‌, నవీన్‌ యాదవ్‌లకు అవకాశం ఇచ్చా. వీళ్లంతా నాకు చుట్టాలా? కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డరు. భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్‌, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, సీతక్కనా బంధువులా? కుటుంబ సభ్యులా? కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్‌, హరీశ్‌రావు, దయాకర్‌రావు, కృష్ణారావు, సంతోష్‌రావు, కవితారావులకు పదవులు ఇచ్చిండు. బయటోళ్లకు అవకాశం ఇచ్చిండా?’’ అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ప్రయాణం పెడితే ఆటో డ్రైవర్లను ఉసిగొల్పిన దుర్మార్గపు చరిత్ర బీఆర్‌ఎస్‌దని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో కనీసం ఒక రేషన్‌ కార్డు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ భారీ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ప్రస్తావించారు. పేదోడికి ఇళ్లు కట్టాలని, బువ్వ పెట్టాలని ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? అని ప్రశ్నించారు. సనత్‌నగర్‌ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెడితే ఆయన కాలి గోటికి సరిపోని వాళ్లు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.


అల్వాల్‌ టిమ్స్‌కు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య పేరు, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు, వరంగల్‌ టిమ్స్‌కు జయశంకర్‌ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ తీసేస్తామంటున్న వాళ్లకు అదే ప్రాంతంలో సర్దార్‌ సర్వాయి పాపన్న, జ్యోతిరావు పూలె విగ్రహాలు పెట్టాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బీఆర్‌ఎస్‌ అనాధలా రోడ్డు మీద వేస్తే మహిళా కమీషన్‌ సభ్యురాలిగా నియమించామని, చాకలి ఐలమ్మ పేరును కోఠి మహిళా వర్సిటీకి పెట్టామని, ఆమె ముని మనువరాలినిమహిళా కమీషన్‌ సభ్యురాలిని చేశామని ప్రస్తావించారు. తాము ఏడాదికి రెండు లక్షల ఇళ్లు కడుతున్నామని, కేసీఆర్‌ పదేళ్లలో 20 లక్షల ఇళ్లు ఎందుకు కట్టలేక పోయారని అడిగారు. అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం ప్రకటించారు. బతుకమ్మ కుంటను కబ్జా పెట్టిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి కేసీఆర్‌ కోసం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించాడని, కేసీఆర్‌ అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తారని చెప్పారు. రూ.16 వేల కోట్ల మిగులు, రూ.70 వేల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రం ఏర్పడితే దాన్ని రూ.8.11 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.


ట్రై కార్పొరేషన్లకు కొత్త లోగోలు

నగరంలోని 3 మునిసిపల్‌ కార్పొరేషన్లకు కొత్త లోగోలు వచ్చాయి. అంబర్‌పేట సభలో సీఎం రేవంత్‌ వాటిని ఆవిష్కరించారు. ఆరున్నర నెలల క్రితం ఏర్పడిన జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ), సైబారాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ)లకు పురపాలక శాఖ లోగోలు రూపొందించింది. ప్రత్యేక ఆకారంలో ’ఎం’ అక్షరాన్ని రూపొందించారు.పచ్చని ఆకులు, నీటి బొట్టు ఆకారాలు.. పచ్చదనం, పర్యావరణం, మెరుగైన పారిశుధ్య నిర్వహణను ప్రతిబింబిస్తాయని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

పసిప్రాయపు ప్రతిబింబం..

బీఆర్‌ఎస్‌ పార్టీకి పరాభవం తప్పదు

Updated Date - Sep 01 , 2026 | 04:51 AM