పసిప్రాయపు ప్రతిబింబం..
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:02 AM
ఓ శిశువు పుట్టిన నాటి నుంచి ఏడాది నిండే వరకు ఉండే అమాయక చూపులు, లేత నవ్వులు, ముద్దుముద్దుగా పాకే తీరులు, బుడిబుడి అడుగుల దశలను పదచిత్రాలుగా మలుస్తూ ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన కవితా సంపుటి ‘తుమ్మెద రెక్కల మీద మువ్వన్నె విల్లుల ఆకాశం’. ఈ పుస్తకంలో మొత్తం 63 హృద్యమైన కవితలు ఉన్నాయి
‘తుమ్మెదరెక్కల మీద మువ్వన్నె విల్లుల ఆకాశం’
కెనడాలో యార్లగడ్డ రాఘవేంద్రరావు కవితాసంపుటి ఆవిష్కరణ
తెలుగు సాహిత్యంలో వినూత్న ప్రయోగం: విమర్శకుల ప్రశంస
ఒక తాతయ్య మనోఫలకంపై విరిసిన
వాత్సల్యపు వసంత కవితల దండగా అభివర్ణన
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఓ శిశువు పుట్టిన నాటి నుంచి ఏడాది నిండే వరకు ఉండే అమాయక చూపులు, లేత నవ్వులు, ముద్దుముద్దుగా పాకే తీరులు, బుడిబుడి అడుగుల దశలను పదచిత్రాలుగా మలుస్తూ ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన కవితా సంపుటి ‘తుమ్మెద రెక్కల మీద మువ్వన్నె విల్లుల ఆకాశం’. ఈ పుస్తకంలో మొత్తం 63 హృద్యమైన కవితలు ఉన్నాయి. ఈ కవితలకు తగిన ఇంగ్లీష్ అనువాదం కూడా జోడించడం విశేషం. కెనాడాలోని ఆష్వా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మనుమరాలు 18 నెలల అవ్యానాతో రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. అనంతరం ఆన్‌లైన్ వేదికగా అనువాదకులు సవ్యసాచి, కల్లూరి శ్యామల, మందలపర్తి కిషోర్ మాట్లాడుతూ.. కవి అనుభవాల గాఢత నుంచి ఒలికిన ఈ పదచిత్రాలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. అక్షరాలు, ఛాయాచిత్రాలు కలగలిసి ఒక తాతయ్య మనోఫలకంపై విరిసిన ఈ వాత్సల్యపు వసంత కవితల దండ, పసిప్రాయపు మాధుర్యాన్ని ప్రేమించే ప్రతి హృదయానికి దక్కిన అమూల్యమైన కానుక అంటూ విమర్శకుడు ఎన్.విజయరాఘవరెడ్డి అభివర్ణించారు. పిల్లలపై చాలా రచనలు వచ్చినా, ఒక పసికందు పుట్టిన రోజు మొదలుకుని, తొలి 365 రోజుల ప్రయాణాన్ని కవితలుగా మలచి సరిగ్గా పుట్టినరోజున మనుమరాలు అవ్యానాకు తాతయ్య యార్లగడ్డ రాఘవేంద్రరావు కానుకగా అందించడం ఒక అరుదైన ప్రయోగమని అభినందించారు. పుస్తక సమీక్షకురాలు నందవరం మృదుల మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని చదివినప్పుడు పురిటింటి బాటసారిని ఇంతలా వర్ణించిన కవిని మరొకచోట చూడలేము అనిపించిందన్నారు. గుర్రం జాషువా పాపాయి పద్యాల్లాగే ఇందులోని ప్రతి కవితలో సార్వజనీనత ప్రతిఫలిస్తోందని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం