Share News

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ

ABN , Publish Date - May 10 , 2026 | 04:48 PM

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ
Mahesh Kumar Goud

హైదరాబాద్, మే10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని బహిరంగ లేఖలో 10 అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం, మూసీ పునరుజ్జీవనానికి అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. లేఖకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...


1. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ

హైదరాబాద్‌ నగరం వేగంగా విస్తరిస్తోంది. ట్రాఫిక్‌ ఒత్తిడి, ప్రజా రవాణా అవసరాలు పెరుగుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఇప్పటికే మెట్రో ఫేజ్‌–1ను రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ అండ్​ నుంచి 100 శాతం వాటా కొనుగోలు చేసింది. విస్తరణకు అడ్డంకులు తొలిగిపోవటంతో ఫేజ్‌–2 విస్తరణకు కేంద్రం తక్షణం ఆమోదం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. మొత్తం 122.9 కి.మీ. విస్తరణకు సుమారు రూ.38,595 కోట్ల ప్రాజెక్టుకు జాయింట్ వెంచర్‌లో చేపట్టేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలి.

2. మూసీ నది పునరుజ్జీవనం

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం తగిన సహకారం అందించాలి. మూసీని కేవలం శుద్ధి ప్రాజెక్టుగా కాకుండా, నగర పర్యావరణం, ప్రజా ఆరోగ్యం, పర్యాటకం, పట్టణ సుందరీకరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టుగా ఎంచుకుంది. కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు జాతీయ స్థాయి అర్బన్​ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుగా పరిగణించి కేంద్రం త్వరగా నిధులు, అనుమతులివ్వాలి.


3. రీజినల్ రింగ్ రోడ్

తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ ​రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్​ ఆమోదంతో పాటు నిధులు మంజూరు చేయాలి.​ దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు అనుమతులు వెంటనే అఫ్రూవ్ చేయాలి. రీజనల్​ రింగ్ రోడ్డు పూర్తైతే హైదరాబాద్‌పై రవాణా ఒత్తిడి తగ్గి, చుట్టుపక్కల జిల్లాల్లో పెట్టుబడులు, ఉపాధి, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి.

4. రీజనల్​ రింగ్​ రైలు

రీజనల్​ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలి. వంద శాతం కేంద్రం నిధులతోనే ఈ ప్రాజెక్టు చేపట్టాలి.

5. గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే

హైదరాబాద్​ నుంచి అమరావతి మీదుగా బందర్​ పోర్ట్ వరకు 12 లేన్​ గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్​ హైవే, హైదరాబాద్​ నుంచి బెంగుళూరు హై స్పీడ్​ కారిడార్​ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్​ ప్రెస్​ హైవే నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం చొరవ చూపాలి.


6. రేడియల్ రోడ్లు

ఔటర్​ రింగ్​ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్​ రోడ్లను నిర్మించాల్సి ఉంది. రేడియల్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.45 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిని రాష్ట్ర రోడ్లుగా కాకుండా, జాతీయ అభివృద్ధి కారిడార్లుగా పరిగణించాలి.

7. హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్ట్

హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ రిలీఫ్ నగరంగా మార్చే ప్రాజెక్టు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి. ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు నిధులివ్వాలి. ఈ ప్రాజెక్టులు పూర్తైతే ప్రయాణ సమయం తగ్గి, ఇంధన వినియోగం, కాలుష్యం, ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతాయి.

8. సెమీ కండక్టర్ ప్రాజెక్టులు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీ పరిసరాలను సెమీకండక్టర్–ఎలక్ట్రానిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రాజెక్టులకు తుది ఆమోదం ఇవ్వాలి.


9. తుమ్మిడిహెట్టి – మహారాష్ట్ర నో అబ్జెక్షన్

తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సాగు నీటిని, తాగునీటిని అందించే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. అంతరాష్ట్ర సమన్వయం అవసరమైనందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగేలా కేంద్రం మధ్యవర్తిత్వం చేయాలి. 150 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి నో అబ్జెక్షన్​ ఇప్పించాలి.

10. విభజన హామీలు – పెండింగ్ అంశాలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో అనేక అంశాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిని కేంద్రం అమలు చేయాలి. కాజీపేటలో ప్రస్తుతం రూ.521 కోట్ల వ్యయంతో తయారీ యూనిట్ పనులు పూర్తికి సమీపంలో ఉన్నప్పటికీ, దాన్ని పూర్తి స్థాయి కోచ్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చేయాలి. పెండింగ్ రైల్వే లైన్లకు ఆమోదం తెలపాలి. కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు త్వరగా మంజూరు చేయాలి.


పై అంశాలను ప్రధాని మోదీకి రాసిన లేఖలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు ఈ అంశాల‌ విషయంలో మోదీపై ఒత్తిడి తీసుకువ‌చ్చి వెంట‌నే అనుమ‌తులు వ‌చ్చేలా చూడాలని ఆయన సూచించారు. ఈ అంశాల‌పైన స్పష్టత ఇస్తేనే తెలంగాణపైన ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రేమ ఉన్నట్లుగా భావిస్తామని, లేకుంటే మిమ్మల్ని రాష్ట్ర ప్రజ‌లు ద్రోహులుగా చూస్తారని మహేశ్ గౌడ్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

వైసీపీ ప్రభుత్వంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టారు: మంత్రి నిమ్మల

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌

Updated Date - May 10 , 2026 | 05:01 PM