తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది: మోదీ
ABN , Publish Date - May 10 , 2026 | 04:40 PM
భాగ్యనగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలూ విస్తరిస్తాయని చెప్పారు మోదీ.
దేశాభివృద్ధిలో నగరాల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతం ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిందని ప్రశంసించారు. 'సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రాల్లో ఒకటిగా మారింది. సైబరాబాద్ అభివృద్ధి కోసం వేలాది కోట్లు కేటాయించాం. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మరింత తీర్చిదిద్దుతాం. ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం వెయ్యి కోట్ల రూపాయలే ఇచ్చారు. మేం రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,500 కోట్లు కేటాయించాం. ఇంకా రూ.50 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. వీటితో పాటు జాతీయ రహదారులు రెట్టింపయ్యాయి. తెలంగాణకు 6 వందేభారత్ సహా 5 అమృత్‌భారత్ రైళ్లను ఇచ్చాం. ఖాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించాం. తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది. రాష్ట్రాల అభివృద్ధి లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదు' అని మోదీ పేర్కొన్నారు.
'ఇంధన భద్రతకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇంధన భద్రతలో మల్కాపూర్ ప్రాజెక్ట్ కీలకం. ప్రపంచం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా చూసుకున్నాం. రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేనూ మాట్లాడను. పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. గుజరాత్‌కు ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్ తరహాలో చేస్తే మీకు సగం నిధులే వస్తాయి.. ఈ నిధులే మీకు సరిపోతాయా? ఈ ప్రతిపాదన నచ్చితే సీఎం రేవంత్ మాతో కలిసి నడవాలి. అభివృద్ధిలో మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేదు. రాజకీయంగా కాదు.. అభివృద్ధిలో నాతో కలవండి' అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ అన్నారు.
రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు.. పరిశ్రమలు, రవాణా, సాంకేతిక రంగాల్లో విస్తృత అవకాశాలను తీసుకురానున్నాయని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా దేశం వేగంగా ముందుకు సాగుతోందని.. తద్వారా రోడ్లు, పరిశ్రమలు, డిజిటల్ మౌలిక వసతులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా భారత్‌ను గ్లోబల్ ఎకనామిక్ పవర్‌గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ వంటి నగరాలు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాయన్నారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
అస్సాం సీఎంగా మళ్లీ ఆయనే.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?