Share News

తుమ్మిడిహెట్టికి కలిసొచ్చిన సుందిళ్ల!

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:38 AM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కాళేశ్వరంలోని సుందిళ్ల బ్యారేజీ కలిసి రానుంది. ఈ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు ఉండగా... అందులో అతి తక్కువ లోపాలు, సీపేజీలు ఉన్నవి ఈ బ్యారేజీలోనే కావడం గమనార్హం.

తుమ్మిడిహెట్టికి కలిసొచ్చిన సుందిళ్ల!

  • కాళేశ్వరంలో తక్కువ లోపాలున్న బ్యారేజీ ఇదే

  • గోలివాడ పంప్‌హౌస్‌తో ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కాళేశ్వరంలోని సుందిళ్ల బ్యారేజీ కలిసి రానుంది. ఈ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు ఉండగా... అందులో అతి తక్కువ లోపాలు, సీపేజీలు ఉన్నవి ఈ బ్యారేజీలోనే కావడం గమనార్హం. తుమ్మిడిహెట్టి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌)లో తుమ్మిడిహె ట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాక... 71.5 కి.మీ దాకా ఉన్న గ్రావిటీ కెనాల్‌లో నీటిని తరలించనున్నారు. అక్కడి నుంచి 76.650 కి.మీ దాకా కొత్త అలైన్‌మెంట్‌లో కాలువ తవ్వనున్నారు. అక్కడి నుంచి 20.90 కి.మీ మేర టన్నెల్‌ తవ్విన తర్వాత... సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేసి, అక్కడే ఉన్న గోలివాడ (సుందిళ్ల) పంప్‌హౌస్‌ నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని పంపింగ్‌ చేయాలని పీఎఫ్ఆర్‌లో ప్రతిపాదించారు.

దీనివల్ల మైలారం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించే భారం ప్రభుత్వానికి తప్పనుండగా.. సుందిళ్ల బ్యారేజీకూడా కలిసొచ్చి దాంతో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం తగ్గనుంది. నీటి తరలింపునకు నాలుగు ప్రత్యామ్నాయాల్లో మూడో ప్రత్యామ్నాయం అనుకూలమని పీఎ్‌ఫఆర్‌లో ఆర్వీ అసోసియేట్స్‌ పేర్కొంది. తక్కువ భూసేకరణ, నిర్మాణంలో సంక్లిష్టతలు తక్కువగా ఈ అలైన్‌మెంట్‌లో ఉంటాయని తెలిపింది. దీనివల్ల హైవేలు, రైల్వే నిర్మాణాలు దాటే ప్రాంతాలు తగ్గుతాయని తెలిపింది. కాగా గోలివాడలోని 14 పంపులన్నీ ఏకకాలంతో నడిపితే 36,582 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయొచ్చు. సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా... మరమ్మతుల అనంతరం 5 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేసి, పంపింగ్‌ చేసుకోవచ్చునని అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించారు.


ఇవీ చదవండి:

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

తలసేమియా బాధితులకు పింఛన్లు

Updated Date - Jul 31 , 2026 | 08:38 AM