ఆయిల్‌పామ్ రైతులకు రక్షణ కల్పించాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:22 AM
దేశీయ ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముడి పామాయిల్ (సీపీవో) దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పున:సమీక్షించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ
కేంద్రంపై ఒత్తిడి పెంచాలని
తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): దేశీయ ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముడి పామాయిల్ (సీపీవో) దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పున:సమీక్షించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈమేరకు ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలకు శుక్రవారం ఆయన లేఖలు రాశారు. తెలంగాణలో ప్రస్తుతం 1.29 లక్షల హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నారని లేఖలో మంత్రి తెలిపారు.
రైతులు దీర్ఘకాలంగా తమ భూములను ఆయిల్‌పామ్ సాగుకు కేటాయించి భారీగా పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. వంట నూనెల దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించి ఆత్మనిర్భరత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే తెలంగాణ రైతులు ఆయిల్‌పామ్ సాగును చేపట్టారని వివరించారు. ఒకవైపు జాతీయ ఆయిల్‌పామ్ మిషన్ ద్వారా రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూనే దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ పామాయిల్ చౌకగా దేశీయ మార్కెట్‌లోకి వస్తుందని, దీంతో దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని తుమ్మల ఆందోళన వ్యక్తంచేశారు.
క్రూడ్ పామాయిల్ దిగుమతి వ్యయం తగ్గితే దేశీయ సీపీవో ధరలపై ఒత్తిడి ఏర్పడి, చివరకు రైతులకు చెల్లించే ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ (ఎఫ్‌ఎ్‌ఫబీ) ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్రానికి రాసిన వివరించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో ఆయిల్‌పామ్ రైతులు ఉన్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా తుమ్మల కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖలు రాశారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పున:సమీక్షించేలా, కేంద్రంపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో త్వరలో ఓపీ సేవలు !
Read Latest Telangana News And AP News And National News
And Telugu News