రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రయాణికుల అవస్థలు..
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:42 AM
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పింది. సకల జనుల సమ్మె తరహాలో నేటి నుంచి పోరుబాట పట్టాలని కార్మికులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్‌షాపుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ఈ రోజు కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల వద్ద కార్మికులు తమ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో తమను తప్పుదారి పట్టిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరుతున్నారు. సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని తేల్చి చెబుతున్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ తమకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక నానావస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాలంటే అధిక ఛార్జీలతో దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాష్ట్ర జనాభాలో 60 శాతం పది కులాలవారే ..
కాంగ్రెస్ రాజకీయ వేదికపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్!