కాంగ్రెస్ రాజకీయ వేదికపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్!
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:18 AM
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికపై కనిపించడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిటీ సిఫార్సులను నీరుగార్చే ప్రయత్నం చేస్తారా?
అనిల్ జైన్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్
చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ
అధికారికంగానే చైర్మన్ పర్యటన: నీటిపారుదల శాఖ
బ్యారేజీల పునరుద్ధరణ పనుల పరిశీలనకే వెళ్లారు
ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు: శాఖ కార్యదర్శి శ్రీధర్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికపై కనిపించడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి అనిల్ జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడం పట్ల సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి, ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సిఫార్సులను ఆయన నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు అనిల్ జైన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనిల్ జైన్ అనుసరిస్తున్న వైఖరి విస్మయం కలిగిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 20న రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డ సందర్శించారు. ఆయన పాల్గొన్న వేదికపై అనిల్‌జైన్ భాగస్వామి కావడం పట్ల కొంతమంది నీటిపారుదల శాఖ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల భద్రత కోసం 1000 బోర్‌హోల్స్ తవ్వాలని ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఇచ్చింది. అందుకు భిన్నంగా కేవలం వంద బోర్‌హోల్స్ తవ్వితే సరిపోతుందని అనిల్‌జైన్ చెప్పడమేంటి? ఎన్‌డీఎస్‌ఏ సూచించిన పరీక్షలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బ్యారేజీల స్థితిగతులపై భూగర్భ పరీక్షలు నిర్వహించాలని సూచించి రెండేళ్లు గడుస్తున్నా, ప్రభుత్వం 6 బోర్‌హోల్స్ మాత్రమే పూర్తిచేసింది. అన్నారం, సుందిళ్లలో ఇప్పటివరకు ఒక్క బోర్‌హోల్ కూడా పూర్తిచేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్‌డీఎస్‌ఏపై ఒత్తిడి తెస్తోంది. మే చివరినాటికి బోర్‌హోల్స్ పూర్తిచేయాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అనిల్ జైన్ ద్వారా సిఫార్సులను మార్చి, తప్పును కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే అవకాశం ఉంది’ అని సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ స్పష్టతనిచ్చారు.
అనిల్ జైన్ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, అది పూర్తిగా అధికారిక పర్యటన అని స్పష్టం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో భాగంగా జరుగుతున్న పరీక్షల పురోగతిని పరిశీలించడానికి, సాంకేతిక బృందాలకు మార్గనిర్దేశం చేయడానికే ఆయన మేడిగడ్డకు వెళ్లారని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకే పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడం ఆ సంస్థ బాధ్యతని, ఆ క్రమంలోనే క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందని పేర్కొన్నారు. అంతేతప్ప సీఎం, మంత్రుల విలేకర్ల సమావేశంలో ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ పాల్గొనలేదని ఇ.శ్రీధర్ పేర్కొన్నారు. కాగా, దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో సీఆర్పీఎఫ్ జవాన్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. బుధవారం, హరియాణాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల స్నాతకోత్సవ వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు.