Share News

రాష్ట్ర జనాభాలో 60 శాతం పది కులాలవారే ..

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:13 AM

తెలంగాణలో మొత్తం 242 కులాలుండగా ఇందులో 10 సామాజికవర్గాలే రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే-2024లో తేలిందని స్వతంత్ర నిపుణుల కమిటీ వెల్లడించింది...

రాష్ట్ర జనాభాలో 60  శాతం పది కులాలవారే ..

  • 50 వేలలోపు జనాభా ఉన్న కులాలు 186

  • 10 లక్షలకు మించి జనాభా ఉన్న కులాల సంఖ్య 10

  • ఓసీల కన్నా మూడు రెట్లు వెనుకబడిన దళిత, గిరిజనులు

  • విద్య వెనుకబాటుతనానికి ప్రధాన కొలమానం.. స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మొత్తం 242 కులాలుండగా ఇందులో 10 సామాజికవర్గాలే రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే-2024లో తేలిందని స్వతంత్ర నిపుణుల కమిటీ వెల్లడించింది. ఈ పది కులాల్లో మాదిగ, ముస్లిం, ముదిరాజ్‌, లంబాడీ, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరు కాపు, పద్మశాలి ఉన్నట్లు పేర్కొంది. 10 లక్షలకు మించి జనాభా ఉన్న కులాలు 10 ఉండగా, 5-10 లక్షల మధ్య జనాభా ఉన్న కులాలు 6, లక్ష నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న కులాలు 24, 50 వేల నుంచి లక్ష మధ్య జనాభా ఉన్న కులాలు 16, 50 వేలలోపు జనాభా ఉన్న కులాల సంఖ్య 186 ఉన్నట్లు నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. సుమారు 3.55 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను, వారి జీవన ప్రమాణాలను విశ్లేషించిన స్వతంత్ర నిపుణుల బృందం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో వెనుకబాటుతనం కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా వారు ఎలా జీవిస్తున్నారనే అంశంపై ఆధారపడి ఉందని నివేదిక వెల్లడించింది. బుధవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిపుణుల బృంద సభ్యులైన కంచె ఐలయ్య, ప్రవీణ్‌ చక్రవర్తి, భాగ్యభుక్యా, దీప్తి, ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌ ఈ నివేదికను విడుదల చేశారు. రాష్ట్ర జనాభాలో అగ్రభాగం బీసీలదేనని వెల్లడించారు. రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా 84.2 శాతం ఉందని, ఒక్క బీసీలే 56.4 శాతంతో అత్యధిక జనాభా కలిగిన సమూహంగా నిలిచారని నివేదిక పేర్కొంది. ఎస్సీలు 17.4 శాతం., ఎస్టీలు 10.4 శాతం, ఓసీలు 11.9 శాతం ఉన్నారని తెలిపింది. జనాభాపరంగా మాదిగ (10.3 శాతం), ముస్లిం (7.9 శాతం), ముదిరాజ్‌ (7.4 శాతం), లంబాడి (6.8 శాతం)లు అగ్రస్థానంలో ఉన్నారని వెల్లడించింది. ‘కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండెక్స్‌’ (సీబీఐ) పేరిట 42 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించారు. ఓసీల వెనుకబాటుతనం సూచిక 31 పాయింట్లుగా ఉంటే, ఎస్సీలది 96, ఎస్టీలది 95 పాయింట్లుగా ఉంది. అంటే ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారు. అలాగే బీసీల వెనుకబాటుతనం 86 పాయింట్లు ఉండగా, రాష్ట్ర సగటు 81 పాయింట్లుగా నమోదైంది. వెనుకబాటుతనాన్ని నిర్ణయించడంలో విద్య అత్యంత కీలకమైన అంశమని నివేదిక తేల్చింది. ఇంగ్లిష్‌ మీడియం విద్య అందుబాటులో ఉన్న కులాలు సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయని పేర్కొంది. పేదరికంలో ఉన్నప్పటికీ ఓసీ వర్గాలకు చెందిన 34 శాతం మంది పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తుండగా.. ఎస్సీ, ఎస్టీల్లో ఆ సంఖ్య 5 శాతంమాత్రమే ఉందని తెలిపింది.


ఎస్సీ, ఎస్టీల్లో 45 శాతం మంది దినసరి కూలీలు..

ఎస్సీ, ఎస్టీల్లో 45 శాతం మంది దినసరి కూలీలుగా జీవనం సాగిస్తుండగా, ఓసీల్లో కేవలం 9 శాతమే ఉన్నట్లు వెల్లడించింది. ప్రైవేట్‌ రంగ వృత్తుల్లో 30 శాతం వాటా ఓసీలదే కాగా, ఎస్టీల వాటా 4 శాతం, ఎస్సీల వాటా 14 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 1.1 కోట్ల మంది రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయంతో గడుపుతుండగా, ఇందులో 58 శాతం మంది బీసీలే ఉండటం ఆందోళనకరమని నిపుణుల బృందం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 33 శాతం ఇళ్లకు ఇప్పటికీ మరుగుదొడ్ల వసతి లేదని, ఓసీల ఇళ్లలో 36 శాతం మందికి రిఫ్రిజిరేటర్లు ఉండగా, ఎస్సీల్లో ఆ సంఖ్య 16 శాతానికి పరిమితమైందని తెలిపింది.

పట్టణీకరణ పెరిగినా తగ్గని కుల వివక్ష..

పట్టణీకరణ పెరిగినప్పటికీ కుల వివక్ష తగ్గలేదని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక వెనుకబాటుతనం మధ్య అంతరం అలాగే ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాల్లోనూ కులాల వారీగా లబ్ధి భిన్నంగా ఉందని, ఎస్సీ, ఎస్టీలు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్ల పథకాల ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందుతుండగా, బీసీలు పెన్షన్లు, గృహజ్యోతి పథకాలపై ఆధారపడుతున్నారని వెల్లడించింది. ఓసీలు రైతు భరోసా, వ్యవసాయ ఉచిత విద్యుత్‌ ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నట్లు సర్వే వెల్లడించింది.

Updated Date - Apr 23 , 2026 | 05:13 AM