టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:36 PM
టెక్స్‌టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్ రంగ ప్రముఖులందరికీ తెలంగాణ, హైదరాబాద్ స్వాగతం పలుకుతోందన్నారు. అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉందని తెలిపారు. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాయని వివరించారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ ఉందన్నారు. నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని తెలిపారు. టెక్స్‌టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని చెప్పారు. టెక్స్‌టైల్స్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయని వెల్లడించారు.
డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని సీఎం తెలిపారు. తమ విజన్ ‘తెలంగాణ రైజింగ్ 2047’ మరోసారి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు సీఎం. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ మారిందని తెలిపారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించిందన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయని.. ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరిందని అన్నారు. చిత్ర పరిశ్రమను తెలంగాణలో ప్రోత్సహిస్తామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణే తమ తొలి ప్రాధాన్యం అని సీఎం పేర్కొన్నారు. గ్రీన్ టెక్స్‌టైల్స్ హబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన
అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత
Read Latest Telangana News And Telugu News