ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: మంత్రి సీతక్క
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:49 PM
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు21: ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధుల నుంచి తప్పించిందని మండిపడ్డారు. వారిని తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లగా తమ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుందని గుర్తు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ల మధ్య వేతనంలో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సైజు, పనుల కల్పనకు ముడి పెట్టకుండా ఫీల్డ్ అసిస్టెంట్‌లందరికీ ఒకే విధంగా వేతనం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా కల్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు.. తమను ఎఫ్‌టీఈలుగా గా కన్వర్ట్ చేయాలని కోరుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో చర్చించి.. త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పెంచడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమైనదని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభివర్ణించారు. మీరు ఎక్కువ సంఖ్యలో కూలీలను నమోదు చేసి.. వారితో పనులు చేయించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతిరోజు రెండు లక్షల కంటే తక్కువగా కూలీల నమోదు ఉందని వివరించారు. ఆ సంఖ్యను కనీసం12 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు కూలీలతో పనులు చేయించినప్పుడు.. మనం ఎందుకు చేయించ లేకపోతున్నామని ఫీల్డ్ ప్రతినిధుల బృందాన్ని మంత్రి సీతక్క సూటిగా ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించి ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
34 ఏళ్ల తర్వాత హత్య కేసులో మాజీ నక్సలైట్ అరెస్ట్
సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం
For More TG News And Telugu News