34 ఏళ్ల తర్వాత హత్య కేసులో మాజీ నక్సలైట్ అరెస్ట్
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:29 PM
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
నంద్యాల, ఆగస్టు21: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1992లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డుకుని హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంను మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా మాడుగుల సుబ్బన్న పేరును పోలీసులు చేర్చారు. నాటి నుంచి అతడి కోసం గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు.
అయితే అతడు కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఇటీవల రహస్య సమాచారం అందింది. దీంతో ఆత్మకూరు సీఐ సురేశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం కర్ణాటక వెళ్లింది. చిత్రదుర్గలో మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గద్దర్ అలియాస్ మంజునాథ్ పాటిల్‌ను వారు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నంద్యాల జేఎంఎఫ్‌సీ (JMFC) కోర్టులో హజరుపరిచారు. 34 ఏళ్లుగా పరారిలో ఉన్న మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న అరెస్ట్‌తో ఆత్మకూరు మండల కేంద్రంలో కలకలం రేగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం
ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్
For More AP News And Telugu News