తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో సర్కార్ కీలక ఒప్పందం
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:45 PM
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సర్గడ్ సంస్థ సీఈఓ సమావేశమయ్యారు. తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సర్గడ్ సంస్థ ముందుకు వచ్చింది.
దావోస్, జనవరి 21: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన సర్గడ్(Sargad) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం(MoU) కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్(MRO) యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎమ్ఆర్‌ఓ కేంద్రాన్ని వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాష్ట్రం.. విమానయాన, ఏరోస్పేస్ రంగాల్లో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.
బ్లైజ్ కంపెనీతో ఎంవోయూ..
అలాగే.. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బ్లైజ్(Blaize) కంపెనీతో మరో ఎంవోయూ కుదిరింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో బ్లైజ్ సీఈఓ దినాకర్ మునగాలా సమావేశమయ్యారు. హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో AI పైలట్ ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో AI హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో బ్లైజ్ సంస్థ అగ్రగామి. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్(R&D) సెంటర్ విస్తరణకు బ్లైజ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, AI రంగాలకు ఊపిరి లభించనుంది. తెలంగాణను AI డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ ప్రారంభంకానుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
తెలంగాణలో స్టీల్ ప్లాంట్
అంతేకాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం రష్మి గ్రూప్‌తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భారీ ఎంవోయూ (MoU) కుదుర్చుకుంది. తెలంగాణలో రష్మి గ్రూప్ ఆధునిక స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సుమారు 12,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్... ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, బొగ్గు లింకేజీలు అందిస్తామని హామీ ఇచ్చింది. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలపై కూడా భాగస్వామ్య చర్చలు జరిగాయి.
కాగా.. సీఎం రేవంత్.. జనవరి 20 నుంచి 23 వరకు దావోస్‌లోని డబ్ల్యూఈఎఫ్ 2026 సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 19న మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసిన అనంతరం, హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయలుదేరారు సీఎం. జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు తెలంగాణ డయాస్పోరా సభ్యులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌ను ప్రపంచ నాయకులు, సీఈఓల ముందు ప్రదర్శించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
ఆదాయానికి మించి ఆస్తులు.. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న
Read Latest Telangana News And Telugu News