Share News

కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. మధును డిస్మిస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Sep 07 , 2026 | 02:49 PM

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. మధును డిస్మిస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 7: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయాలు జరుగుతాయని.. నిర్ణయాలు జరిగిన తర్వాత చర్చలు జరగవని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపైనా చర్చ జరుగుతుందన్నారు. స్పీకర్‌ చైర్‌ను అవమానిస్తే స్పందించాల్సిన అవసరం బీజేపీకి లేదా అని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను అవమానించారని మండిపడ్డారు.


అత్యంత అవమానకరంగా స్పీకర్‌నుద్దేశించి మాట్లాడితే.. ఇంతకంటే చర్చకు ప్రాధాన్యమున్న అంశం ఇంకేముంటుందని సీఎం అడిగారు. ఇది స్పీకర్‌ చైర్‌ గౌరవానికి సంబంధించిన విషయంగా చెప్పుకొచ్చారు. సభాపతి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీఆర్‌ఎస్ వేసిన అపవాదు, దుర్మార్గాలను బీజేపీ ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. సమాజం తలదించుకునేలా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణకు చీకటిరోజని అన్నారు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని తెలిపారు. దూషించాలని కేసీఆరే పురిగొల్పి పంపించారని ఆరోపించారు. సభ్య సమాజం సహించలేని భాష మాట్లాడారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


దళితులు, గిరిజనులే కాదు.. సభ్య సమాజానికే జరిగిన అవమానం ఇది అని ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవానికే గాయమైందని.. స్పీకర్‌పై అత్యంత అసభ్యకరంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళిత వ్యక్తిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ వ్యాఖ్యానించారు. సభాపతిని దూషించడం అందరికీ అవమానకరమన్నారు. స్పీకర్‌పై అభ్యంతరకరంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సమర్థించాలని బీజేపీ చూస్తోందా అని ప్రశ్నించారు. అందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయమిది అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు.


దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక ఆలోచనను సరిదిద్దకపోతే భవిష్యత్‌ తరాలు ఈ సభను క్షమించవన్నారు. ఈ రకమైన అవమానం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. స్పీకర్‌ చైర్‌ను అభ్యంతరకర భాష మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్‌ఎస్ డిస్మిస్‌ చేయాలన్నారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని.. లేకపోతే బర్తరఫ్‌ చేయాలన్నారు. తాము ఏం మాట్లాడినా వెనుక కేసీఆర్ ఉన్నారని బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 03:26 PM