Share News

అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి.. పెళ్లైన 17 రోజులకే విషాదం..

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:30 PM

అమెరికాలో తెలంగాణకు చెందిన 28 ఏళ్ల యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. పెళ్లైన 17 రోజులకే మృతిచెందడం సంచలనంగా మారింది.

అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి.. పెళ్లైన 17 రోజులకే విషాదం..
Mohammed Jaber Hussain

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పెళ్లైన 17 రోజులకే మృతిచెందడం సంచలనంగా మారింది. మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ మహమ్మద్ జాబెర్ హుస్సేన్(28) నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా అతను ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జాబెర్ తన గదిలో నిద్రలోనే మృతిచెందినట్లు అతని రూమ్‌మేట్ బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.


అయితే, జాబెర్ మృతికి గల కచ్చితమైన కారణాలపై స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, జాబెర్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. అనంతరం అతను మసాచుసెట్స్‌కు తిరిగి వెళ్లాడు. జాబెర్ భార్య కూడా అతనితో కలిసి మసాచుసెట్స్‌కు వెళ్లిందా, లేదా? అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే యువకుడు మృతిచెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా, మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని జాబెర్ తండ్రి కోరారు.


ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు జాబెర్ తండ్రి లేఖ రాశారు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి తన కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలన్నారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ కూడా బాధిత కుటుంబం తరఫున స్పందించారు. కేంద్ర మంత్రి జైశంకర్‌ తక్షణమే జోక్యం చేసుకుని జాబెర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

బాంచెన్‌ బతుకులు బందూకులై..

Updated Date - Sep 17 , 2026 | 12:38 PM