Bhatti Vikramarka: దేశంలోనే రోల్ మోడల్, గేమ్ ఛేంజర్‌గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:10 PM
తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇది.. తెలంగాణ విద్యా రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని ఆయన అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్.. రాష్ట్ర విద్యా రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఉపముఖ్యమంత్రి మరోసారి తన నిబద్ధతను వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో ఇవాళ(సోమవారం) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ స్కూల్స్ నిర్మాణ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని ఆయన తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్లకు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు భట్టి. స్కూల్స్ నిర్మాణ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనన్నారు. పనులు పూర్తి చేయడానికి క్యాలెండర్ ఖరారు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రతి వారం ప్రగతి సమీక్ష జరపాలని.. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి 15 రోజులకు బిల్స్ పేమెంట్ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ఈ ఆదేశాల ద్వారా ప్రాజెక్ట్ అమలులో వేగం, జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా చూస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎక్కువ సంఖ్యలో స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కాగా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక సమానత్వం, సమగ్ర విద్యా అవకాశాలు అందరికీ అందుబాటులోకి రావాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
దేశంలోనే రోల్ మోడల్‌గా, గేమ్ ఛేంజర్‌గా నిలిచేలా ఈ స్కూల్స్ రూపకల్పన చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక సౌకర్యాలు, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా-కరిక్యులర్ యాక్టివిటీస్‌తో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ స్కూల్స్ దోహదపడతాయని రేవంత్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 105కి పైగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబడుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున స్కూల్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్‌లో రూ.11,600 కోట్లు, మరిన్ని దశల్లో రూ.21,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
సామాజిక సమానత్వం, విద్యా విప్లవం..
ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా కుల, మత, ఆర్థిక వివక్షలు తొలగి, అందరూ ఒకే వేదికపై చదువుకునే అవకాశం లభిస్తుంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా విద్యను సమానత్వ సాధనంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇవి కేవలం భవనాల నిర్మాణం కాదు.. సమాజంలో సామరస్యం, సమాన అవకాశాలు, భవిష్యత్ తరాల బలోపేతం కోసం చేపట్టిన విప్లవాత్మక అడుగని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..
భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And Telugu News