తెలంగాణలో శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:22 AM
సహకార వ్యవస్థతోనే రైతుల ఆర్థిక అభ్యున్నతి సాధ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణలో శ్వేత విప్లవం 2.0ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సహకార వ్యవస్థతోనే రైతుల ఆర్థిక అభ్యున్నతి..
2029 నాటికి దేశంలో 75 వేల సహకార సంఘాలు: కిషన్‌రెడ్డి
తూప్రాన్‌లో రూ.400 కోట్లతో అమూల్ డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన
నెలల్లోనే పూర్తిచేసి, అందుబాటులోకి తెస్తామన్న కేంద్రమంత్రి
హాజరైన మంత్రులు వివేక్, శ్రీధర్‌బాబు, ఎంపీ రఘునందన్
తూప్రాన్/మనోహరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థతోనే రైతుల ఆర్థిక అభ్యున్నతి సాధ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణలో శ్వేత విప్లవం 2.0ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్ మునిసిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద రూ.400 కోట్లతో అమూల్ సంస్థ నిర్మించతలపెట్టిన డెయిరీ ప్లాంట్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ తెలంగాణ పాడి రైతుల ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. రానున్న 18 నెలల్లో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని, స్థానిక మహిళలు, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యమని వెల్లడించారు. తూప్రాన్ డెయిరీ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాలు సేకరించి.. పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, ఐస్‌క్రీమ్, నెయ్యి వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తామన్నారు. రైతులంతా సహకార సంఘాలుగా ఏర్పడితే దళారుల దోపిడీ, రాజకీయ జోక్యం తగ్గుతాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో శ్వేత విప్లవం 2.0లో భాగంగా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణాలోనూ 1,525 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.
మహిళా సంఘా లు రూ.20 లక్షల వరకు లభించే బ్యాంక్ రుణాలను ఉపయోగించుకొని పశు పోషణను విస్తరించాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని 1964లో 19 సంఘాలతో ప్రారంభమై ప్రస్తుతం 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్‌తో 10,500 కోట్ల టర్నోవర్‌కి చేరిందని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు పాల డెయిరీలు వెన్నెముక లాంటివన్నారు. మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ అమూల్ ప్లాంట్‌ను చెన్నూరులో కూడా ఏర్పాటు చేస్తే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మంచి మార్కె ట్ ఉంటుందని, దీనికి కేంద్రం సహకరించాలని కోరారు.
రైతన్నకు అదనపు ఆదాయం అందించాలనే దృఢ సంకల్పంతోనే కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి సహకారంతో ఈ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చినట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. కాగా కార్యక్రమం మొదలై ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతుండగానే ప్రజలు ఒక్కొక్కరుగా లేచి పక్కనే ఏర్పాటు చేసిన భోజనాల హాల్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మంత్రి వివేక్, మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించినప్పటికీ సభలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. కేంద్రమంత్రి అమిత్‌షా ఈ సభకు రాకపోవడంపై అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది.
పోలీసులకు భోజన ఏర్పాట్లపై స్వల్ప వివాదం
అమూల్ సంస్థ నిర్వాహకులు రైతులకు భోజనాలు ఏర్పాటు చేసినా.. విధుల్లో ఉన్న పోలీసులకు భోజనాలు పెట్టకపోవడం వివాదానికి దారితీసింది. అమూల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ రఘునందన్‌రావు జోక్యం చేసుకుని పోలీసులకు సంస్థ తరఫున క్షమాపణలు తెలిపారు. ఆయనే చొరవ తీసుకొని పోలీసులకు భోజన ఏర్పాట్లు చేయించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇవి కూడా చదవండి...
రూ.400 కోట్లతో సాబన్ మెగా డెయిరీ ప్లాంట్
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
గుజరాత్ ‘చింతన్‌శివిర్’కు మంత్రి కోమటిరెడ్డి
Read Latest AP News And Telugu News