Share News

పగలు భగభగ.. రాత్రి గజగజ

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:07 AM

రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అలాగే రాత్రి వేళ శీతాకాలం మాదిరిగా చలి పెరుగుతోంది.

పగలు భగభగ.. రాత్రి గజగజ
Telangana weather

  • కోహిర్‌లో 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

  • టేకులపల్లిలో అత్యధికంగా 37 డిగ్రీలు

  • 32 జిల్లాల్లో ఎండ తీవ్రతపై ఎల్లో అలెర్ట్‌

హైదరాబాద్‌/విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అలాగే రాత్రి వేళ శీతాకాలం మాదిరిగా చలి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. అక్టోబరు నెలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 15.3డిగ్రీలకు చేరింది. అలాగే రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 16.3, వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌, కామారెడ్డి జిల్లా గాంధారిలలో 17.1, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో 17.4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు చేరాయి. ఇక హైదరాబాద్‌లోని మౌలాలి, శేరిలింగంపల్లిలో సైతం 17.1డిగ్రీలు రికార్డయ్యాయి. జనగాం జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఎండ తీవ్రతకు సంబంఽధించి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య ఉన్నాయి. జగిత్యాల జిల్లా భీమారం, కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో అత్యధికంగా 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


వచ్చే మార్చి వరకూ కరువు ప్రభావం

తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగింది. ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో రానున్న రెండు నెలల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. ఆ తరువాత క్రమేపీ బలహీనపడనున్నది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగనున్నది. ఎల్‌నినో సంవత్సరాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయని చరిత్ర చెబుతోంది. దేశంలో 1871 నుంచి 2026 వరకు... 155 ఏళ్లలో 27సార్లు అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ పేర్కొంది.


అదే 1950 తరువాత పదిహేనుసార్లు కరువు వచ్చింది. 1972, 2009 సంవత్సరాల్లో అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కాగా, ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలలు వర్షాలు తగ్గడంతో వేడి వాతావరణం నెలకొంది. భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం గతంతో ఎన్నడూ లేనంత ఎక్కువగా సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో గాలిలో తేమశాతం తగ్గడం మరింత ఆందోళన కలిగిస్తోందని వాతావరణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు సుధాకర్‌ మృతి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:07 AM