Share News

యూఎల్‌సీకి కొత్త దారి

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:53 AM

యూఎల్‌సీ భూముల్లో ఏళ్ల తరబడి ఉంటున్నా హక్కులు దక్కక అవస్థలు పడుతున్నవారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది.

యూఎల్‌సీకి కొత్త దారి

  • పాత దరఖాస్తులతో పాటు కొత్తవారికీ అవకాశం..

  • త్వరలో మార్గదర్శకాలు..

  • ఇల్లు, నిర్మాణం ఉన్న స్థలాలకే తొలి ప్రాధాన్యం

  • ఖాళీ స్థలమైతే సేల్‌డీడ్‌ ఉండాల్సిందే

  • గజానికి రూ.200 నుంచి రుసుం!

  • జీవో 92 నాటి తాత్కాలిక కట్టడాల ఎత్తులకు చెక్‌

  • గడువు దాటినవారికి, దరఖాస్తు చేయలేకపోయినవారికీ చాన్స్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): యూఎల్‌సీ భూముల్లో ఏళ్ల తరబడి ఉంటున్నా హక్కులు దక్కక అవస్థలు పడుతున్నవారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ఇల్లు లేదా ఏదో ఒక నిర్మాణం ఉన్న స్థలాలకు తొలి ప్రాధాన్యం, సేల్‌డీడ్‌ ఉన్న ఖాళీ స్థలాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. గజానికి రూ.200 నుంచి నామమాత్రపు రుసుం తీసుకుని క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదన కూడా ఉంది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవారికి, చేసుకున్నా గడువులోగా ప్రక్రియ పూర్తి చేయలేకపోయినవారికి ఈసారి అవకాశం ఇవ్వనుంది. పాత జీవోల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి సెప్టెంబరు 27నే మెమో ఇచ్చిన సర్కారు, ఇప్పుడు కొత్త దరఖాస్తుల స్వీకరణకు దారులు తెరుస్తోంది.


మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది. అసలు సమస్య ఏమిటంటే.. 1976 నాటి పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం ప్రకారం నగరాల్లో పరిమితికి మించి ఉన్న ఖాళీ భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించింది. ఆ భూముల్లో తర్వాతి కాలంలో ప్లాట్లు చేతులు మారాయి. ఇళ్లు లేచాయి. కానీ రికార్డుల్లో ఇప్పటికీప్రభుత్వ మిగులు భూములే. దాంతో అమ్మాలన్నా, కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, రుణం తీసుకోవాలన్నా అడుగు ముందుకు పడటం లేదు. 2002 నుంచి 2016 వరకు పలు విడతల్లో అవకాశాలు ఇచ్చినా వేల మంది ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.


ఈసారి నిబంధనలు ఇలా..

కొత్తగా దరఖాస్తులు తీసుకుంటే ఎలాంటి నిబంధనలు పెట్టాలి, అర్హతను ఎలా తేల్చాలి, పాత జీవోల పరిధిని ఎంతవరకు వర్తింపజేయాలి అనే అంశాలపై రెవెన్యూ శాఖ ఇటీవల అధికారులతో చర్చించింది. ఏదో ఒక నిర్మాణం ఉన్న యూఎల్‌సీ భూమిని క్రమబద్ధీకరణలో మొదట తీసుకోవాలని, ఓపెన్‌ ల్యాండ్‌ అయితే సేల్‌డీడ్‌ ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ చర్చల్లో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇక్కడ గత అనుభవం హెచ్చరిస్తోంది. జీవో 92 కింద క్రమబద్ధీకరణకు ఏదో ఒక నిర్మాణం తప్పనిసరి అన్నారు. ఆ షరతును ఆసరాగా చేసుకుని కొందరు అప్పటికప్పుడు తాత్కాలిక కట్టడాలు వేసి ఖాళీ స్థలాలను కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఆ లొసుగు మళ్లీ దొరకకుండా ఈసారి స్పష్టమైన విధివిధానాలు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజుల విషయంలోనూ పాత ఉత్తర్వుల తరహాలో కాకుండా, గజానికి రూ.200 నుంచి ఎంతో కొంత నామమాత్రపు రుసుం వసూలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.


11 వేల ఎకరాలు.. పరిష్కారం 15 శాతమే

కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాలవారీగా యూఎల్‌సీ భూముల వివరాలను తెప్పించింది. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో సుమారు 4,300 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 3,500 ఎకరాలు, హైదరాబాద్‌ జిల్లాలో 3,200 ఎకరాలున్నాయి. అంటే ఈ 3 జిల్లాల్లోనే సుమారు 11 వేల ఎకరాలు. ఇన్ని జీవోలు ఇచ్చినా ఇందులో క్రమబద్ధీకరణ అయింది 15ు లోపేనని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.


24 ఏళ్లు.. 12 జీవోలు.. తీరని వెతలు

ఒకే భూమి.. ఒకే వివాదం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిబంధనలు మాత్రం మారుతూ వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2002 జూలై 29న జీవో 455, 456తో క్రమబద్ధీకరణ మొదలైంది. ఆక్రమణదారులు, భూ యజమానుల హక్కుల మేరకు క్రమబద్ధీకరించాలని జీవో 455 చెబితే, అందుకు మార్గదర్శకాలను జీవో 456 ఇచ్చింది. ఆ తర్వాత దరఖాస్తుల గడువును 2006 ఫిబ్రవరిలో జీవో 183తో, 2008 సెప్టెంబరులో జీవో 1076తో, అదే ఏడాది డిసెంబరులో జీవో 1480తో.. మూడుసార్లు పెంచారు. విధాన నిర్ణయాలపై స్పష్టత కోసం 2008 ఏప్రిల్‌లో జీవోలు 615, 747, ఫీజుల ఖరారుకు అదే ఏడాది అక్టోబరులో జీవో 1173 వచ్చాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 డిసెంబరు 30న అభ్యంతరం లేని యూఎల్‌సీ భూములకు జీవో 58, ప్రభుత్వ, యూఎల్‌సీ మిగులు భూములపై హక్కుల క్రమబద్ధీకరణకు జీవో 59 ఇచ్చారు.


పాత జీవోలు 455, 456, 615, 747 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల కోసం అదే నెలలో జీవో 60 తెచ్చారు. చివరగా 2016 మే 26న ఖాళీ స్థలాల కోసం జీవో 92 వచ్చింది. పదే పదే జీవోలు.. గడువు పెంపులు.. నిబంధనల సడలింపులు.. మార్గదర్శకాల సవరణలు.. అయినా క్షేత్రస్థాయిలో సుమారు 18 వేల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగులు భూముల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు, స్థలం కొని ఇల్లు కట్టుకున్నవారు, రకరకాల లావాదేవీలు చేసిన వారు.. అందరిదీ ఒకటే వేదన. కొన్ని కాలనీలు సగం క్రమబద్ధీకరణకు నోచుకుంటే, మరికొన్నింటిలో అసలు కదలికే లేదు. హక్కులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. నిర్మాణ అనుమతులు రావడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దశాబ్దాలుగా నానుతున్న ఈ సమస్యను పరిష్కరిస్తామని, యూఎల్‌సీ భూములకు కొత్త విధానం తెస్తామని సెప్టెంబరు 16న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దాంతో బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 05:53 AM