ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. ఇక నుంచి చలాన్లు కట్టకుంటే లైసెన్స్ ఫ్రీజ్..
ABN , Publish Date - Mar 20 , 2026 | 10:23 AM
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బైక్, స్కూటర్, కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఐదుకు మించి ఉంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది.
హైదరాబాద్, మార్చి 20: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మీ వాహనాలకు పోలీసులు విధించిన చలాన్లు ఇంకా చెల్లించలేదా? ఇకపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. సంవత్సరంలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళుతుంది. వెంటనే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీని అధికారులు బ్లాక్ చేయవచ్చు. లైసెన్స్ లేదా ఆర్సీ బ్లాక్ అయిన తర్వాత, పెండింగ్ చలాన్లు చెల్లించే వరకు ఆర్టీఏ ద్వారా అందే వాహన సేవలు నిలిపి వేయబడతాయి.
గత కొంతకాలంగా ట్రాఫిక్ చలాన్లపై వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం, జరిమానాలపై ఉన్న అభ్యంతరాలను త్వరితంగా పరిష్కరించేందుకు ‘గ్రీవెన్స్ రెడ్రసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ రెండు రోజుల్లో జారీ కానున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో చలాన్ల విషయంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు ఫిర్యాదులను పరిష్కరిస్తారు. ఇతర జిల్లాల్లో అదనపు ఎస్పీలు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.
రహదారులపై అమర్చిన కెమెరాల ద్వారా తీసిన ఫోటోల ఆధారంగా చలాన్లు 3 రోజుల్లో, ఫిజికల్‌గా తీసిన ఫోటోలు 15 రోజుల్లో వాహనదారులకు పంపబడతాయి. మీకు అందిన చలాన్ సరికానిదని, తప్పుగా పడిందని భావించినట్లయితే.. 45 రోజుల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఫిర్యాదు అందిన తరువాత అధికారులు 30 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఆ నిర్ణయాన్ని మీరు సమ్మతించనట్లయితే.. 50 శాతం చలాన్ ఫీజు చెల్లించి కోర్టులో కేసు నమోదు చేయొచ్చు. కోర్టుకు వెళ్లొద్దు అనుకుంటే చలాన్ ఫీజు మొత్తం చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు ఇస్తారు. ఒకవేళ పోలీసులు వేసిన చలాన్ తప్పు అని కోర్టు భావిస్తే.. ఆ చలాన్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త చర్యల వల్ల వాహనదారులు సకాలంలో చలాన్లను పరిష్కరించుకుంటారన్న ఉద్దేశమే కాకుండా, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించడం కోసమని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆ కంటి మందుకు అనుమతుల్లేవు
Read Latest Telangana News and National News