Share News

పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: మంత్రి జూపల్లి

ABN , Publish Date - Jun 08 , 2026 | 08:27 PM

తెలంగాణ టూరిజంకు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూప్లలి కృష్ణారావు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: మంత్రి జూపల్లి
TG Minister Jupally Krishna Rao

హైదరాబాద్, జూన్ 08: తెలంగాణ టూరిజంకు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూప్లలి కృష్ణారావు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తొలి దశలో 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వాటిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్య స్థానాలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ‘స్లో టూరిజం’కు ప్రాధాన్యం ఇవ్వాలని వారికి సూచించినట్లు తెలిపారు. ప్రకృతి, చరిత్ర, సంస్కృతి కలగలిపిన పర్యాటక అనుభూతిపై దృష్టి సారించామని వివరించారు.


వికారాబాద్, రామప్ప దేవాలయం, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. భువనగిరిని దేశంలోనే అగ్రశ్రేణి హెరిటేజ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా యోచిస్తున్నామన్నారు. కేరళలో జటాయువు తరహాలో ఐకానిక్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. స్కైవాక్‌లు, వ్యూడెక్స్, అడ్వెంచర్ యాక్టివిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.


సోమశిలలో క్రూయిజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్‌కు భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌పై నిలపాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణను ప్రారంభించామని మంత్రి జూపల్లి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తికి 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ

For More TG News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 09:08 PM