సింథటిక్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీ, రసాయనాల అక్రమ మళ్లింపును అరికట్టేందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
రసాయనాల అక్రమ మళ్లింపుపై కఠిన చర్యలు
ఈగల్ ఫోర్స్ సమన్వయ సమావేశంలో నిర్ణయం
రసాయన, ఫార్మా పరిశ్రమలకు మార్గదర్శకాలు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీ, రసాయనాల అక్రమ మళ్లింపును అరికట్టేందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లోని ఈగల్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగాలు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. సింథటిక్, డిజైనర్ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలపై నిఘాను పెంచడంతోపాటు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029లోని నాలుగు ప్రధాన అంశాలైన ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ అండ్ ఆపరేషన్స్, సింథటిక్ డ్రగ్ కంట్రోల్, డిమాండ్-హార్మ్ రిడక్షన్, సామర్థ్య పెంపు-సమన్వయంపై దృష్టి సారించాలని తీర్మానించారు. రాష్ట్రంలోని కెమికల్ యూనిట్లు, ల్యాబ్‌లు, పరిశోధన-అభివృద్ధి కేంద్రాల సమాచారాన్ని సమన్వయం చేసి పంచుకోవాలని నిర్ణయించారు. రసాయన తయారీ సంస్థలు తమ రియాక్టర్లు, ఇతర తయారీ మౌలిక వసతులను అనధికార వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇవ్వడం తీవ్ర ప్రమాదకరమని అధికారులు అభిప్రాయపడ్డారు.
నిషేధిత ఈ-సిగరెట్లు టీనేజర్లు, యువత, చిన్నారులకు విక్రయిస్తున్న అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వీటి విక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాలని నిర్ణయించారు. కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళి (వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్-వీసీసీ)ను పాటించాలని ఈగల్ ఫోర్స్ సూచించింది. బొల్లారం, జిన్నారం, చర్లపల్లి, జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్, యాదాద్రి భువనగిరి, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లోని కెమికల్, ఫార్మా సంస్థల ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు లాజిస్టిక్స్ మార్గాలు దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలతో త్వరలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎలివేటెడ్ కారిడార్‌తో రూ.1,200 కోట్లు ఆదా
Read Latest Telangana News And Telugu News