Share News

సైబర్‌ నేరగాళ్ల పంజా

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:52 AM

సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని.. ట్రేడింగ్‌తో భారీ లాభాలు సంపాదించొచ్చంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరు తో ఒక మహిళను నిండా ముంచారు.

సైబర్‌ నేరగాళ్ల పంజా
Hyderabad cyber crime

  • టెర్రర్‌ ఫండింగ్‌ చేశావంటూ వృద్ధుడికి బెదిరింపు కాల్స్‌

  • డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.55.20 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

  • ట్రేడింగ్‌ యాప్‌ పేరిట టెకీకి టోకరా

  • రూ.35.50 లక్షలకు బురిడీ

  • టాస్కుల పేరిట మహిళ నుంచి రూ.4.20 లక్షలు లూఠీ

  • సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని.. ట్రేడింగ్‌తో భారీ లాభాలు సంపాదించొచ్చంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరు తో ఒక మహిళను నిండా ముంచారు. ఈ రెండు ఘటనలపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు లు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి శంకర్‌రెడ్డి(72) మొబైల్‌కు సెప్టెంబర్‌ 28న కాల్‌ వచ్చింది. ముంబై పోలీసు అధికారినంటూ సందీ్‌పరావు అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. శంకర్‌రెడ్డి పేరుతో ముంబైలో మనీ లాండరింగ్‌, టెర్రర్‌ ఫండింగ్‌కు సంబంధించి రూ.2 కోట్ల లావాదేవీలపై కేసు నమోదైందని చెప్పాడు. తనకు కెనరా బ్యాంకులో ఖాతా లేదని చెప్పినా వినిపించుకోలేదు.


తర్వాత డేటా ప్రొటెక్షన్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఐఏ అధికారుల పేరుతోనూ నిందితులు వాట్సాప్‌ వీడియో కాల్స్‌ చేసి బెదిరించారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. వాట్సాప్‌ వీడియో కాల్స్‌లో సీబీఐ కార్యాలయాన్ని పోలిన నకిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉపయోగించి నిజమైన అధికారులుగా నమ్మించారు. బ్యాంకులో ఉన్న డబ్బంతా ‘వెరిఫికేషన్‌’ కోసం తమకు బదిలీ చేయాలని.. విచారణ అనంతరం క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌తో ఆ మొత్తం తిరిగిచ్చేస్తామని చెప్పారు. దీంతో నిందితులు చెప్పినట్టు శంకర్‌రెడ్డి రూ. 55.20 లక్షలు బదిలీ చేశారు. ఈ మొత్తం రితికా ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు వెళ్లినట్లు తన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి టోకరా..

మరో ఘటనలో స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాల పేరిట ఒక సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు రూ.35.50 లక్షలకు మోసం చేశారు. బాచుపల్లికి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి గీతకు (46) ఆగస్టు 20న ఫేస్‌బుక్‌లో స్టాక్‌ మార్కెట్‌ ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్‌ చేసి, వివరాలు ఇవ్వడంతో.. ‘ఎస్‌ఐజీ కోర్‌ డిస్కషన్‌ గ్రూపు’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులోకి ఆమెను చేర్చారు. దీంతో దశలవారీగా మొత్తం రూ. 35.50 లక్షలను ఆమె బదిలీ చేశారు. అనంతరం నిఫ్టీ పీడబ్ల్యూఎం యాప్‌లోని ఆమె ఖాతాలో రూ.1.10కోట్ల పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్‌ ఉన్నట్లు చూపించారు. షేర్లను విడుదల చేయాలంటే మరో రూ.57.42లక్షలను చెల్లించాలని చెప్పారు.


ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ట్రేడింగ్‌ ఖాతాను ఫ్రీజ్‌ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. అలాగే, పార్ట్‌టైం జాబ్‌ పేరుతో సేబర్‌ నేరగాళ్లు ఒక మహిళను రూ.4.20 లక్షలకు మోసగించారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన మహిళ (50)ను సైబర్‌ నేరగాళ్లు టెలిగ్రామ్‌ ద్వారా సంప్రదించారు. ప్రకటనపై క్లిక్‌ చేసి, స్ర్కీన్‌షాట్‌ పంపితే గంటకు రూ.100 చెల్లిస్తామని చెప్పారు. వారు చెప్పినట్లు చేయగా.. కొంత మొత్తం పంపారు. అనంతరం పెయిడ్‌ టాస్క్‌లు చేయాలంటూ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో చేర్చారు. పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ పలు దఫాలుగా రూ4.26 లక్షలను వేర్వేరు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. యాప్‌లో రూ.7.36 లక్షలు లాభం వచ్చినట్లు చూపించి, ఉపసంహరించుకోవాలంటే రూ..3.68 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ మహిళ సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి...
ఎలివేటెడ్‌ కారిడార్‌తో రూ.1,200 కోట్లు ఆదా

అమెరికాకు ముల్కనూర్‌ బియ్యం

సచివాలయంలో తాగు నీటికి తిప్పలు!
Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 04:52 AM