Share News

టీమార్స్‌ చీఫ్‌ ఎవరో?

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:56 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీమార్స్‌ (తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ అండ్‌ రైల్‌ సేఫ్టీ బ్యూరో) చీఫ్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయమై పోలీసు శాఖలో చర్చ మొదలైంది.

టీమార్స్‌ చీఫ్‌ ఎవరో?
TEAMARS IPS officer

  • డైరెక్టర్‌ పదవిపై పోలీసు వర్గాల్లో చర్చ

  • సీనియర్‌ ఐపీఎస్‌ను నియమిస్తారా?

  • పదవీ విరమణ చేసిన వారికి బాధ్యతలా?

హైదరాబాద్‌, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీమార్స్‌ (తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ అండ్‌ రైల్‌ సేఫ్టీ బ్యూరో) చీఫ్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయమై పోలీసు శాఖలో చర్చ మొదలైంది. రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గత నెలలో టీమార్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యూరోకు చీఫ్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై తీవ్ర కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటైన ఈగల్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, టీజీ సేఫ్‌ విభాగాలకు సమర్థులైన అధికారులను నియమించారు. హైడ్రా చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ను నియమించారు. టీజీ సేఫ్‌ బాధ్యతలను అవినాష్‌ మహంతికి అప్పగించారు.


టీమార్స్‌ చీఫ్‌ పోస్టును అదనపు డీజీపీ స్థాయిగా పేర్కొనడంతో ఆ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని డైరెక్టర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్నతాధికారుల కొరత ఉంది. దీంతో ఒకే ఐపీఎస్‌ అధికారి పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చివరకు పదవీ విరమణ పొందిన సందీప్‌ శాండిల్య, ఏఆర్‌ శ్రీనివాస్‌ లాంటి వారినీ ప్రభుత్వం కీలక పోస్టుల్లో నియమించింది. ఈ క్రమంలో సర్వీసులో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలా? లేక పదవీ విరమణ చేసిన సమర్థులకు అప్పగించాలా? అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పదవీ విరమణ చేసిన అదనపు డీజీ స్థాయి అధికారి వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిర్వహణకు ఒకే విధమైన సిగ్నలింగ్‌ వ్యవస్థ, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, రోడ్‌ మార్కింగ్‌ సైన్‌ బోర్డుల పర్యవేక్షణ, రహదారి నిర్వహణ శాఖలతో సమన్వయం కోసం టీమార్స్‌ పని చేయనుంది. అలాగే, ఈ చలాన్‌ వ్యవస్ధ పర్యవేక్షణ, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, ఒవర్‌ స్పీడ్‌ తదితర ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు, హైవే పెట్రోలింగ్‌, రైలు, మెట్రో భద్రతను పర్యవేక్షించనుంది.


ఇవి కూడా చదవండి...
ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను దాటాం
పెరిగిన సేవలు.. సరిపోని సిబ్బంది
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:56 AM