Share News

ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:50 AM

ఈఎస్ఐ మెడికల్‌ స్కామ్‌ కేసులో నిందితురాలైన నాటి జాయింట్‌ డైరెక్టర్‌ పద్మను ఏసీబీ కేసు నుంచి తప్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?
ESI medical scam

  • రూ.211కోట్ల మెడికల్‌ స్కామ్‌ కేసు

  • మూసేయడంపై సీఎం ఆగ్రహం

  • నాటి ఐఎంఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరణపై ఆరా తీస్తున్న నిఘా వర్గాలు

  • 2019లో ఐఏంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణితో పాటు పద్మ అరెస్టు

హైదరాబాద్‌, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): ఈఎస్ఐ మెడికల్‌ స్కామ్‌ కేసులో నిందితురాలైన నాటి జాయింట్‌ డైరెక్టర్‌ పద్మను ఏసీబీ కేసు నుంచి తప్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ‘ఏసీబీ కేసులు.. సర్కారు బ్రేకులు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం గురించి శనివారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ప్రస్తావించారు. ‘‘ఏసీబీ వాళ్లు కష్టపడి పట్టుకుని కేసులు నమోదు చేస్తుంటే లోపాయికారీగా నిందితులను వదిలేస్తుంటారా? ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది? ప్రాసిక్యూషన్‌ అనుమతులు ఎందుకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు?’’ అంటూ ఆయన మండిపడ్డట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన.. మొత్తం ఏసీబీ కేసులకు సంబంధించి యాక్షన్‌ డ్రాప్‌పై సవివర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.


ఈఎ్‌సఐలో మందుల కొనుగోళ్ల కుంభకోణంపై.. 2019 జూలైలో నాటి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నాటి డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మ, ఇందిరతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఆ కుంభకోణం విలువ దాదాపు రూ.300 కోట్లుగా అప్పట్లో ఏసీబీ అధికారులు అంచనా వేశారు. కృత్రిమ ఎమర్జెన్సీ సృష్టించి అత్యవసర మందుల కొనుగోలు పేరిట సాధారణ టెండర్‌ ప్రక్రియను తప్పించుకుని లోకల్‌ పర్చేజ్‌ ఆర్డర్లను విడుదల చేయడం ద్వారా భారీ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణం ఉండటంతో.. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కొన్ని కంపెనీల ద్వారా అధిక ధరలకు మందులు, ల్యాబ్‌ కిట్లు, సర్జికల్‌ సామగ్రి కొనుగోలు చేశారని ఈడీ విచారణలో వెల్లడైంది. ఉన్నతాధికారులే కొన్ని బినామీ సంస్ధలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కొనుగోళ్లు జరిపిన విషయాన్ని ఈడీ గుర్తించింది.


నాటి జాయింట్‌ డైరెక్టర్‌ అయిన పద్మ మెడికల్‌ క్యాంపుల పేరుతో మందులు, ఇతర సరఫరాలను దారి మళ్లించారని, కొన్ని మందులను అవసరానికి మించి కొనుగోలు చేశారని.. సరఫరా, స్టాక్‌ రికార్డుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు 2023లో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 17 మందిపై ఈడీ పక్కా ఆధారాలతో నేరాభియోగ పత్రాన్ని న్యాయస్ధానంలో దాఖలు చేసింది. టెండర్‌ నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధిక ధరలకు మందుల కొనుగోళ్లు తదితర కారణాల వల్ల ప్రభుత్వానికి రూ.211 కోట్ల నష్టం కలిగిందన్న విషయం ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా సంపాదించిన డబ్బుతో నిందితులు ఆభరణాలు, భూములు, ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశారు. వాటిలో నాటి జాయింట్‌ డైరక్టర్‌ పద్మకు సంబంధించిన రూ.74లక్షల ఆస్తులు ఉన్నట్టు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో ఆమెపై కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రాసిక్యూషన్‌ అనుమతి నిరాకరిస్తూ కార్మిక శాఖ ఉన్నతాధికారుల నుంచి ఏసీబీకి లేఖ వెళ్లింది. దీంతో ఏసీబీ అధికారులు ఆమెపై నేరారోపణలను గత ఏడాది డ్రాప్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనం నేపథ్యంలో.. ఈ కేసులో చక్రం తిప్పిందెవరన్న అంశపై నిఘావర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.


ఇవి కూడా చదవండి...
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక

ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను దాటాం
పెరిగిన సేవలు.. సరిపోని సిబ్బంది
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:50 AM