Share News

వికసిత్‌ భారత్‌లో తెలంగాణ కీలకం

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:36 AM

వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించేందుకు సిద్థంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని చెప్పారు.

వికసిత్‌ భారత్‌లో తెలంగాణ కీలకం
Bhatti Vikramarka

  • 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం

  • వికసిత్‌ భారత్‌ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించేందుకు సిద్థంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ‘వికసిత్‌ భారత్‌ వైపు భారతదేశ ప్రయాణానికి ఆర్థిక సహకారం’ సదస్సులో భట్టి మాట్లాడారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని కేంద్రం లేదా రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.


తెలంగాణ రాష్ట్రం కేవలం నిధులను కోరేందుకు కాకుండా, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ చర్చలో పాల్గొంటోందని తెలిపారు. తెలంగాణ బలమైన ఆర్థిక పునాదులతో తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉందని చెప్పారు. 2025-26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలని వివరించారు. సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. ఇదే వృద్ధి పథంలో కొనసాగితే 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా ఉందని..


అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించిందని వెల్లడించారు. 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే మౌలిక వసతులకు నిధులు సమకూర్చే విధానంలో మార్పు అవసరమని భట్టి పేర్కొన్నారు. అభివృద్ధి ఒకే నగరానికి పరిమితం కాకూడదన్న లక్ష్యంతో తెలంగాణ ‘క్యూర్‌, ప్యూర్‌, రేర్‌’ పేరుతో మూడు పరస్పర అనుసంధానిత ఆర్థిక ప్రాంతాలతో ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించిందని పేర్కొన్నారు. భవిష్యత్‌ నగరాలకు నమూనాగా 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్థి చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సదస్సు అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, నిధుల కేటాయింపులపై తమ వాదనను సదస్సులో స్పష్టంగా వినిపించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..
ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 06:36 AM