Share News

ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:30 AM

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325లో ప్రస్తుతం సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు రైతుల నుంచి సరికొత్త వాదన తెరపైకి వస్తోంది. 2015లో నాటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎర్రవల్లిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించారు.

ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు
Panduranga Reservoir

  • వివాదాస్పద సర్వే నంబర్‌ 325లో నిర్మాణం

  • 52.09 ఎకరాల అసైన్డ్‌.. 21.20 ఎకరాల పట్టా భూమి సేకరణ

  • కొందరు రైతులకు ఎకరాకు రూ.12లక్షల చొప్పున పరిహారం

  • భూమికి పరిహారంగా భూమితో 55 మంది అంగీకారం

  • భూమి దక్కని రైతుల ఫిర్యాదుతోనే విషయం రేవంత్‌ దృష్టికి

గజ్వేల్‌/మర్కుక్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325లో ప్రస్తుతం సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు రైతుల నుంచి సరికొత్త వాదన తెరపైకి వస్తోంది. 2015లో నాటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎర్రవల్లిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించారు. నాలుగు ఎకరాల కుమ్మరోని కుంటను 80 ఎకరాలకు పెంచి పాండురంగ రిజర్వాయర్‌గా విస్తరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశం కావడంతో ఈ రిజర్వాయర్‌ అంశం తెరపైకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సర్వే నంబర్‌ 325లోనే ఈ రిజర్వాయర్‌ ఉండటం, పలువురు రైతుల నుంచి భూమిని సేకరించడం ప్రస్తుత వివాదానికి కారణంగా తెలుస్తోంది.


ఎర్రవల్లికి చెందిన సర్వే నంబర్‌ 325లో గల అసైన్డ్‌ భూమి 52.09 ఎకరాలు, పట్టా సర్వే నంబర్లు అయిన 338, 339, 340లలో గల 21.20 ఎకరాలను సేకరించి కుమ్మరోని కుంటకు సంబంధించిన నాలుగు ఎకరాలను కలుపుకొని 77.05 ఎకరాలలో రూ. 8కోట్లతో పాండురంగ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రిజర్వాయర్‌కు తమ పట్టాభూములను ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ. 12లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందజేశారు. మిగిలిన 55 మంది రైతులకు భూమికి భూమి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 325 సర్వే నంబర్‌లో గల మిగిలిన రైతుల నుంచి తలా కొంత సేకరించి భూమిని కోల్పోయిన రైతులకు భూమి ఇచ్చే ప్రయత్నాన్ని అప్పట్లో అధికారులు చేసినట్లు తెలిసింది.


ఈ క్రమంలో ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న రైతులు తమ భూమిని ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో సమస్య జటిలంగా మారింది. పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్‌ స్వయంగా పలువురు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రిజర్వాయర్‌లో భూనిర్వాసితులుగా మారిన 55మంది రైతులను ఒప్పించి, భూమిని ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వం మారింది. మిగిలిన రైతులు పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉండటంతో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మారిన ఇన్నాళ్లకు పలువురు రైతులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతోనే ఆయన అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు కొందరు రైతులు చెబుతున్నారు.


కాగా పాండురంగ రిజర్వాయర్‌తో భూగర్భజలాలు పెరగడంతో పాటు 70ఎకరాలకు సంబంధించిన రైతులు బోరు మోటార్లను రిజర్వాయర్‌లో వేసుకుని వరి పండించుకుంటున్నారు. నిర్వాసితులైన రైతులు తమకు న్యాయం జరగాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో తమకు న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. పలువురు రైతులు సర్వే నంబర్‌ 325లో తమకు ఉండాల్సిన భూమికి మించి పొజిషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం సదరు రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..
రక్త బంధం కన్నా ఎక్కువ భూ బంధం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 06:30 AM