Share News

అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కు ఊరట..

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:55 PM

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కు ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కు ఊరట..
Nampally Court

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అయితే, రూ.10 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ష్యూరిటీలు సమర్పించిన తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.


కాగా, తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సమావేశాల తొలి రోజే అసెంబ్లీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసిన నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. స్పీకర్‌ ఆదేశాల మేరకు చొక్కాలు మార్చుకుని రావాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు బయట బీఆర్‌ఎస్‌ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి మండిపడ్డారు.


ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై దుర్భాషలాడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దళిత స్పీకర్‌ను అవమానించారంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో అక్కడంతా గందరగోళంగా మారింది. మరోవైపు, దీనిపై స్పందిస్తూ సభలోనే స్పీకర్ కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి హాజరుపర్చగా.. రిమాండ్‌కు నాంపల్లి కోర్టు తిరస్కరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీ వ్యహహరం.. హైకోర్టులో వాడీవేడి వాదనలు.. తీర్పు వాయిదా

సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్

Updated Date - Sep 08 , 2026 | 05:37 PM