Jagga Reddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:54 PM
తెలంగాణలో నీటి వాటాపై అధికార కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వేళ.. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల వ్యవహారశైలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఎండగట్టారు.
హైదరాబాద్, జనవరి 04: ఆంధ్రప్రదేశ్ నీళ్ల దోపిడి చేస్తుందంటూ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తూర్పు జగ్గారెడ్డి మాట్లాడుతూ నీళ్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాతే తెలంగాణకు నీళ్లు వచ్చినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారంటూ వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం వల్లే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నారని ప్రచారం చేశారని బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ పాలనలో అసలు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు నిర్మాణం జరిగిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇక సింగూరు, మంజీరా డ్యామ్‌లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని వివరించారు.
హైదరాబాద్ మహానగర ప్రజలకు సింగూరు, మంజీరా డ్యామ్‌ల ద్వారా తాగునీరు అందుతుందని జగ్గారెడ్డి తెలిపారు. సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదని చెప్పగలరా? అంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. 2014లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. నాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కోరితే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించాలని ఈ పదేళ్లలో మీకు గుర్తు రాలేదా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీశ్ రావును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బల్ల గుద్ది మరి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
రేవంత్ పాలనలో పాలమూరు ప్రజలకు నిరాశే మిగిలింది: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News