MP Raghunandan Rao: రేవంత్ పాలనలో పాలమూరు ప్రజలకు నిరాశే మిగిలింది: ఎంపీ రఘునందన్
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:20 PM
పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రెండు పార్టీలు.. నష్టం చేస్తూనే ఉన్నాయన్నారు.
సంగారెడ్డి, జనవరి 04: రెండేళ్ల తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ లోక్‌సభ సభ్యుడు ఎం. రఘునందన్ రావు జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పాలమూరు ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీలో చర్చలను వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా సబ్జెక్టు మీదనే జరపాలంటూ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఐబీ గెస్ట్ హౌస్‌లో బీజేపీ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. శాసనసభలో పాలమూరు, కృష్ణా జలాలపై మాట్లాడకుండా ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికే సరిపోతుందంటూ అధికార, విపక్ష పార్టీలపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను తిట్టడం, కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ తిట్టడమే తప్పా.. చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదన్నారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రెండు పార్టీలు.. నష్టం చేస్తూనే ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలకు విజన్ లేదని చెప్పారు. ప్రతి చేనుకు నీరు.. ప్రతి చేతికి పని లక్ష్యంతో బీజేపీ నదుల అనుసంధానం పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం నువ్వెంత తిన్నవు, నేనెంత తినాలే అనే ధ్యాసలోనే ఉన్నారన్నారు.
శాసన సభలో ఓ మంత్రి పవర్ ప్రజంటేషన్ ఇస్తే ప్రతిపక్ష నేత మరో ప్రజంటేషన్ ఇస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టడమే తప్ప కృష్ణా జలాల పంపిణీ, పాలమూరు విషయంలో నాటి బీఆర్ఎస్‌కు నేటి కాంగ్రెస్‌కు తేడా లేదని వివరించారు. ఈ రెండు పార్టీల సీఎంలు పాలమూరు ప్రజలను వంచించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా 20 మంది ఎమ్మెల్యేలు లేకపోవడం విడ్డూరమని ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలవదు: కేటీఆర్
For More TG News And Telugu News