Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 04 , 2026 | 02:44 PM
ఉత్తరాంధ్రలోని భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ఆదివారం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడితోపాటు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దిగారు.
అమరావతి, జనవరి 04: భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్‌పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆదివారం భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్ కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వ్యాలిడేషన్ ప్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రాంతీయ అనుసంధానం (కనెక్టివిటీ) బలోపేతం అవుతుందని.. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీగా ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు అందించిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఎయిర్ పోర్ట్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తికానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మితమవుతోంది. ఆదివారం ఈ ఎయిర్‌పోర్ట్‌లో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతోపాటు విమానయాన సంస్థ అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ఎయిర్ పోర్ట్ పూర్తయిందని జీఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26వ తేదీన ఈ ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News