సీనియర్ సిటిజన్స్ కమిషన్ చీఫ్ కమిషనర్గా జస్టిస్ తిరుమలాదేవి
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:34 AM
వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోని ఉద్యోగులకు గుణపాఠం చెప్పేందుకు తెచ్చిన చారిత్రాత్మక చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు సర్కారు చర్యలు వేగవంతం చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
22న బాధ్యతల స్వీకరణ!
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోని ఉద్యోగులకు గుణపాఠం చెప్పేందుకు తెచ్చిన చారిత్రాత్మక చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్ యాక్ట్-2026’ నిబంధనల పర్యవేక్షణకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చట్టం అమలుకు అత్యంత కీలకమైన ‘సీనియర్ సిటిజన్స్ కమిషన్’కు నూతన చీఫ్ కమిషనర్ను సర్కారు నియమించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈ.తిరుమలాదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక చీఫ్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లతో ఈ కమిషన్ పనిచేస్తుందని జీవోలో స్పష్టం చేసింది.
దసరా సెలవుల అనంతరం.. ఈ నెల 22న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. చీఫ్ కమిషనర్ మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందైతే అది) ఈ పదవిలో కొనసాగుతారు. తల్లిదండ్రులను గౌరవించడం, వారిని సంరక్షించడం ప్రతి ఉద్యోగి నైతిక బాధ్యత అని పేర్కొంటూ రూపొందించిన ఈ చట్టం కింద.. కన్న వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి నిర్దిష్ట మొత్తాన్ని మినహాయించి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. చీఫ్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే బాధితులైన తల్లిదండ్రులు తమ పరిస్థితుల్లో మార్పు వస్తే ఫిర్యాదును ఉపసంహరించుకునే వెసులుబాటును కూడా చట్టంలో కల్పించారు. తల్లిదండ్రులు మరణించినట్లయితే.. సదరు ఉద్యోగి జీతం మినహాయింపు ఆదేశాలను రద్దు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని విధివిధానాల్లో స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రశాంత్భూషణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
త్వరలో యూఎల్సీ మార్గదర్శకాలు?
సొంత మనుషులపై మరిగే నీళ్లు పోయడం కేటీఆర్ నైజం
Read Latest AP News And Telangana News And International