Share News

అవును.. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చాం

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:19 AM

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ (స్కిల్‌ డెవల్‌పమెంట్‌) కోసం నిధుల కేటాయింపులు, చెల్లింపుల వ్యవహారంపై ఆశాఖ ఉన్నతాధికారి వివరణలు విస్మయపరుస్తున్నాయి.

అవును.. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చాం
Telangana Skill Development Funds

  • ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు..

  • శిక్షణ కోసం నిధుల చెల్లింపులపై వివరణ

  • వ్యక్తమవుతున్న అనుమానాలు

  • ముందే నిధుల విడుదల వెనుక ఆంత్యర్యమేంటన్న ప్రశ్నలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ (స్కిల్‌ డెవల్‌పమెంట్‌) కోసం నిధుల కేటాయింపులు, చెల్లింపుల వ్యవహారంపై ఆశాఖ ఉన్నతాధికారి వివరణలు విస్మయపరుస్తున్నాయి. ఆరోపణలను ఖండించే క్రమంలో అధికారికంగా విడుదల చేసిన రిజైండర్లే ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘నిరుద్యోగ నిధుల భక్షణ?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా శిక్షణే ప్రారంభం కాకముందే కోట్లాది రూపాయల నిధులను ముందస్తుగా (మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా) విడుదల చేసినట్లు సంబంధిత శాఖ అధికారే స్వయంగా అంగీకరించడం గమనార్హం.


శిక్షణ మెటీరియల్‌, మొబిలైజేషన్‌, ఇతర ఏర్పాట్ల కోసం అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామని చెబుతున్నప్పటికీ, దీనివెనుక అసలు మతలబు ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద పెద్ద పనులకే అడ్వాన్స్‌లిచ్చే నిబంధన లేనప్పుడు, కేవలం స్కిల్‌ ట్రైనింగ్‌ పేరుతో ముందే నిధులు విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బడ్జెట్‌ మురిగిపోకుండా ఉండేందుకే ఆర్థిక సంవత్సరం చివరిలో నిధులు విడుదల చేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో శిక్షణ ప్రారంభం కాకుండానే నిధులు డ్రా చేసుకోవడంపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి.


నైపుణ్య శిక్షణ కోసం ఏఎఫ్‌సీ, ఎన్‌ఐ-ఎంఎస్ఎంఈ సంస్థలను ఎంపిక చేసినట్లు వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ ఎంపికకు టెండర్‌ నిర్వహించారా? ఎంపిక కమిటీ , అర్హత ప్రమాణాలు, ఆమోద ఉత్తర్వులు, వర్క్‌ ఆర్డర్లను బహిరంగపరుస్తారా అనే చెప్పాల్సి ఉంది. టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టిన విషయం, ఈ నిధుల చెల్లింపులు, ముందస్తు అడ్వాన్స్‌ల ప్రక్రియపై విజిలెన్స్‌, ఇంటిలిజెన్స్‌ వర్గాలు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఏసీబీ కస్టడీకి నిమ్స్‌ లక్ష్మీ భాస్కర్‌

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.71 కోట్ల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:19 AM